ధ‌నుష్ కొడుకు అపరాధానికి శిక్ష‌

ప్ర‌ముఖ స్టార్ హీరో కొడుకు అప‌రాధానికి శిక్ష విధించారు. అత‌డు హ‌ద్దు మీరాడు. లైన్ క్రాస్ చేసాడు. అందువ‌ల్ల అత‌డిపై అధికారులు జ‌రిమానా విధించారు. ఇంత‌కీ ఎవ‌రు అత‌డు? అంటే.. స్టార్ హీరో ధ‌నుష్ కుమారుడు యాత్ర రాజా. ఇంత‌కీ ఏం అప‌రాధం చేసాడు? అంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు యాత్రకు పోలీసులు జరిమానా విధించారు. ధనుష్‌కి ఇద్దరు కుమారులు. యాత్ర పెద్ద‌వాడు. లింగ రెండవ‌ కుమారుడు. ఇద్దరూ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ధనుష్ పెద్ద కొడుకు యాత్రకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు పోలీసులు జరిమానా విధించారు.

ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర తాజా వీడియోలో సూపర్‌బైక్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది సోషల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. వీడియోలో యాత్ర పోయెస్ గార్డెన్ ప్రాంతంలో సూపర్ బైక్ నడుపుతూ కనిపించాడు. సహాయకుడు అతనికి ద్విచక్ర వాహన డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. అయితే ధనుష్ కొడుక్కి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, అతడికి ఇంకా పద్దెనిమిదేళ్లు నిండని కారణంగా తాజా వీడియో వివాదానికి దారితీసింది.

వీడియో వైరల్ కావడం ఈ వీడియోలో ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ కనిపించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు యాత్ర తల్లి ఐశ్వర్య రజనీకాంత్ ని క‌లిసి విచారణ చేపట్టారు. ధనుష్ కొడుకు ముఖానికి మాస్క్ ధరించి ఉండటంతో.. అది యాత్ర అని నిర్ధారించేందుకు పోలీసులు ఐశ్వర్య రజనీకాంత్‌ను విచారించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బహిరంగంగా బైక్ నడిపినందుకు యాత్రకు రూ.1000 జరిమానా విధించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ధనుష్ – ఐశ్వర్య ఏడాది కింద‌ట విడిపోయారు. అయితే ఇద్దరూ తమ కొడుకులను బాగా చూసుకోవడం ద్వారా మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. యాత్ర ఇటీవల తన తల్లి ఐశ్వర్య, తాత రజనీకాంత్ ల‌తో కలిసి దీపావళిని జరుపుకున్నాడు. దీపావళి వేడుక నుంచి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాత్ర రూపం అచ్చం ధ‌నుష్ ని పోలి ఉండ‌డంతో అత‌డు మ‌రో సూప‌ర్ స్టార్ అవుతాడంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్ర‌తిభావంతుడైన ధ‌నుష్ లెగ‌సీని ముందుకు న‌డిపించే వార‌సుడు ఇలాంటి త‌ప్పులు చేయ‌కూడ‌ద‌ని కూడా సూచిస్తున్నారు.