ఎంజాయ్ చేయడం మానేసి.. ఈ రచ్చ ఎందుకంట?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల అభిమానులు కాస్తా శృతి మించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ విమర్శలు చేసుకుంటారు. ఒకప్పుడు అభిమానులు రోడ్ల మీదకొచ్చి కొట్టుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా ఆ ప్రభావం కనిపిస్తోంది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ మధ్య కొత్తగా రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోల పుట్టినరోజు నాడు వారి పథ సినిమాలని ఫ్యాన్స్ షోలుగా ప్రదర్శించడం పోకిరితో స్టార్ట్ చేశారు. కేవలం సరదా కోసం ఈ ట్రెండ్ ని మొదలు పెట్టారు. అయితే తరువాత దీనిని అందరూ అలవాటుగా మార్చేసుకున్నారు. ఇక పోకిరి సినిమా ప్రదర్శించి ఊరుకుంటే సరిపోయేది కాని కలెక్షన్స్ ఎనౌన్స్ చేశారు.

దీంతో మిగిలిన హీరోల అభిమానులు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతూ తమ హీరో బెస్ట్ అని చూపించుకోవడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ జల్సా మూవీ రీరిలీజ్ చేసి పోకిరి కలెక్షన్స్ ని బ్రేక్ చేశారు. తరువాత ఖుషి మూవీ కూడా అత్యధిక సెంటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

ఇక దీనిని కొనసాగిస్తూ ప్రభాస్ వర్షం బిల్లా సినిమాలు రీరిలీజ్ చేసిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఆరెంజ్ మూవీ ని నాగబాబు ఏకంగా రీరిలీజ్ చేయడంతో పాటు గట్టిగా ప్రమోషన్ కూడా చేశారు. దీంతో ఈ మూవీ మూడు కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టింది. ఏకంగా మూడు రోజుల పాటు ఈ మూవీని థియేటర్స్ లో ప్రదర్శించడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా తారక్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి మూవీని భారీఎత్తున రీరిలీజ్ చేశారు. హైలైట్ ఏంటంటే దీనికి ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిరహించారు.

అలాగే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రమోట్ చేశారు. ఇక ఈ సినిమాతో ఖుషి కలెక్షన్స్ బ్రేక్ చేసాం అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టి వైరల్ చేశారు. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని ప్రచారం చేశారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే 4 కోట్లు గ్రాస్ దాటినా ఖుషిని బ్రేక్ చేయలేదు.

అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులు తారక్ అభిమానులని ట్రోల్ చేస్తున్నారు. ఫేక్ కలెక్షన్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఒకరిపై ఒకరు దూషణలకి దిగుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. హ్యాపీగా అభిమాన హీరో సినిమాని ఎంజాయ్ చేయకుండా కలెక్షన్స్ రికార్డ్స్ కోసం పరుగులు పెడితే అసలుకె ఇబ్బంది అవుతుందనే మాట వినిపిస్తోంది.