చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇప్పించిన లక్ష్మీపార్వతి.?

అదేంటో, చంద్రబాబు ముందు రాజకీయ ప్రత్యర్థులు కొన్ని విషయాల్లో బలహీనమైపోతుంటారు. ఇది కావాలనే జరుగుతోందా.? కేవలం చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇప్పించేందుకే, ఆయన మీద అర్థం పర్థం లేని కేసులు వేస్తుంటారా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయనుకోండి.. అది వేరే సంగతి.

అసలు విషయంలోకి వస్తే, టీడీపీ అధినేత , చంద్రబాబు మీద దశాబ్దంన్నర క్రితం అక్రమాస్తుల కేసు నమోదయ్యింది. అదీ స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వేసిన కేసు. ఆ కేసు చాన్నాళ్ళపాటు తొక్కివేయబడిందంటారామె. ప్రస్తుతం లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెకు గౌరవప్రదమైన పదవి కూడా దక్కింది. ఈసారి పక్కగా చంద్రబాబుని ఇరికించేయగలనన్న ధీమాతో వున్నారు నిన్నమొన్నటిదాకా లక్ష్మీపార్వతి. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి పెట్టిన కేసు వీగిపోయింది. న్యాయస్థానం ఆ కేసుని కొట్టిపారేసింది.

ఏసీబీ కోర్టు, ఆ పిటిషన్ని కొట్టివేయడానికి కారణంగా విచారణార్హత లేతని పేర్కొనడం గమనార్హం. సరైన ఆధారాల్లేకుండా ఎలా పిటిషన్లు వేస్తారని కూడా కోర్టు చీవాట్లు పెట్టిందట. అదేంటీ, అన్ని ఆధారాలూ వున్నాయంటూ దాదాపు దశాబ్దంన్నరగా లక్ష్మీపార్వతి చెబుతూ వున్నారు కదా.? ఆమెకు వంతపాడుతూ వైసీపీ కూడా నానా యాగీ చేసింది కదా.? పాపం లక్ష్మీపార్వతి.. వైసీపీని ఈసారి గట్టిగానే నమ్ముకున్నారు, చంద్రబాబు మీద కేసు విషయంలో తనకు అండగా నిలబడుతుందని. కానీ, వైసీపీ.. ఆమెకు సహకరించినట్టు లేదు.

ఇంకోపక్క వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేయడంలో దిట్ట.. అందుకే ఆయన ఈ కేసు గెలవగలిగారంటూ వైసీపీ నుంచివాదనలు దూసుకొస్తున్నాయనుకోండి.. దీన్నే చేతకానితనం అంటారు. మొత్తమ్మీద, అల్లుడు (లక్ష్మీపార్వతి, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి కదా.. అందుకే చంద్రబాబు ఆమెకు అల్లుడయ్యారన్నమాట.. ఆమె కూడా అలానే పిలుస్తుంటారు అప్పుడప్పుడూ ఆయనగార్ని) విషయంలో లక్ష్మీపార్వతి బొక్కబోర్లా పడాల్సి వచ్చింది న్యాయపోరాటంలో. అంతేనా, లేదంటే.. చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇప్పించాలనే ప్రయత్నంలో ఆమె వ్యూహాత్మకంగా ఎలాంటి ఆధారాల్లేకుండా పిటిషన్ వేశారనుకోవాలా.?