మరో ‘సెంచరీ’ కొట్టిన కుట్టి బ్రదర్స్‌

ఒక వైపు హిందీ, తెలుగు ఇతర భాషల సినిమా ఇండస్ట్రీల్లో సక్సెస్‌ రేటు దారుణంగా పడిపోతున్న ఈ సమయంలో మలయాళ సినీ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా భారీ విజయాలు నమోదు అవుతున్నాయి. చిన్న బడ్జెట్‌ సినిమాలుగా రూపొంది వందల కోట్లు వసూళ్లు చేసిన మలయాళ సినిమాలు ఎన్నో ఉన్నాయి.

ఈ ఏడాది ఆరంభం నుంచి మలయాళ సినిమాల జోరు మొదలు అయ్యింది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు నమోదు చేసి సంచలనం సృష్టించాయి. అబ్రహం ఓజ్లర్‌, ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మేల్‌ బాయ్స్‌ ఇలా పలు సినిమాలు వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి.

మలయాళ సినిమాల వంద కోట్ల వసూళ్ల జోరు కంటిన్యూ అవుతోంది. తాజాగా ఫాహద్‌ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు వారాలు కూడా పూర్తి అవ్వకుండానే ఆవేశం సినిమా వంద కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేసి సర్‌ప్రైజ్ చేసింది.

పుష్ప సినిమాలో నటుడిగా తెలుగు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసిన ఫాహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్రలో నటించిన ఆవేశం సినిమా విడుదల సమయంలో పెద్దగా అంచనాలు లేవు. ఆయన జనాలను థియేటర్లకు రాబట్టగలడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ వంద కోట్లకు పైగా వసూళ్లతో ఆవేశం మూవీ దూసుకు పోతుంది.

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో త్వరలోనే తెలుగు మరియు ఇతర భాషల్లో డబ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఫాహద్‌ ఫాజిల్‌ యొక్క నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మలయాళ స్టార్స్ మరో వంద కోట్ల సినిమాను తమ ఖాతాలో వేసుకోవడం ఇతర భాషల ఫిల్మ్‌ మేకర్స్ చూసి నేర్చుకోవాల్సిన విషయం.