మాస్ ఇమేజ్ కి దూరంగా ఆ ముగ్గురు మెగా హీరోలు!

మెగా బ్రాండ్ తో టాలీవుడ్ కి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి మెగా ఫ్యామిలీ అంటే మాస్ కి పెట్టింది పేరు. మెగా హీరోలకు మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజే వేరు. మెగాస్టార్ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాలతో మాస్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత ఈ జనరేషన్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా మాస్ ఆడియన్స్ ని మెప్పించి మాస్ లో సరికొత్త బ్రాండ్ క్రియేట్ చేశారు. కానీ ప్రజెంట్ మెగా ఫ్యామిలీ లో ఉన్న ఓ ముగ్గురు హీరోలకి మాత్రం మాస్ ఇమేజ్ రావడం కష్టంగా కనిపిస్తుంది. ఆ ముగ్గురు మెగా హీరోలు మరెవరో కాదు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్.. వీరిలో వైష్ణవ్ తేజ్ విషయానికొస్తే..

‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ వైష్ణవ తేజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది సాఫ్ట్ బాయ్ రోల్స్ మాత్రమే. తాజాగా ‘ఆదికేశవ’ మూవీతో మాస్ హీరోగా మెప్పించేందుకు ప్రయత్నించాడు. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక వరుణ్ తేజ్ ‘గద్దల కొండ గణేష్’ అనే మాస్ మూవీ చేశాడు. అందులో తన మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా ఫిదా, తొలిప్రేమ వంటి సినిమాలే అతనికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.

అందుకే వరుణ్ తేజ్ కి మాస్ రోల్స్ కన్నా లవర్ బాయ్, సాఫ్ట్ హీరో రోల్స్ బాగుంటాయి అన్న టాక్ ఆడియన్స్ లో ఉండిపోయింది. ఇక చివరగా అల్లు శిరీష్.. ఈ హీరో చేసింది తక్కువ సినిమాలే. సక్సెస్ రేట్ కూడా తక్కువే. మొదటి సినిమా ‘గౌరవం’ తోనే హీరోయిజం చూపించాలని అనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. ఆ తర్వాత శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఈ రెండు సినిమాల్లోనూ అల్లు శిరీష్ క్యారెక్టర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దాంతో ఈ హీరోకి మాస్ రోల్స్ ఏమాత్రం సెట్ కావనే అభిప్రాయం ఆడియన్స్ కి వచ్చింది. వీళ్ళు తప్పితే మెగా ఫ్యామిలీ లో ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు మాస్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ హీరోలు మాస్ సినిమాలతో మెప్పిస్తారా? లేక సాఫ్ట్ రోల్స్ లోనే మిగిలిపోతారా? అనేది చూడాలి.