రీల్ కాదు రియల్: రమా రాజమౌళి లవ్ స్టోరీ

తెలుగు సినిమా సత్తాను విశ్వ వేదిక మీద చాటిన క్రెడిట్ కచ్ఛితంగా రాజమౌళికే చెల్లుతుంది. ఇంత జరిగినా.. ఆయన మౌనంగా ఉంటారే తప్పించి.. ఎక్కువ హడావుడి చేయరు. తానేం చెప్పాలనుకున్నా.. తన సినిమాతో చెప్పేస్తారే తప్పించి.. ఉత్త మాటల్లో ఆయన ఎక్కువగా చెప్పరు. మితభాషిగా.. సిగ్గరిగా వ్యవహరించే ఆయన పని విషయంలో ఎంత రాక్షసంగా ఉంటారో ఆయనతో పని చేసిన నటీనటులు చెప్పేస్తుంటారు.

ఆయనకు సహచరిగా.. సహధర్మచారిణిగా వ్యవహరించే రమా రాజమౌళిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి విజయంలోనూ ఆమె వెన్నంటే ఉంటారు. నిజానికి రాజమౌళిలో ప్రత్యేకత ఏమంటే.. ఆయన తాను తీసే సినిమాలో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం నేరుగా భాగస్వామ్యమయ్యేలా చేస్తారు. అలాంటిది మరెవరిలోనూ చూడలేం.

దర్శకుడిగా రాజమౌళి.. కథ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్.. క్యాస్టూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి.. సంగీత దర్శకుడిగా కీరవాణి.. ఆయన సతీమణి లైన్ ప్రొడ్యూసర్ గా.. కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా.. మొత్తం కుటుంబం కలిసి పని చేయటం ప్రత్యేకతగా చెప్పాలి. ఇక.. రమా రాజమౌళి లవ్ స్టోరీలోకి వెళితే.. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది.

కీరవాణి.. రాజమౌళి ఇద్దరు అన్నదమ్ముల కొడుకులు. కీరవాణిని రాజమౌళి ఎంతలా గౌరవిస్తారో తెలిసిందే. కీరవాణి భార్య వల్లి సోదరి రమా. దీంతో.. వీరిద్దరి మధ్య సాదాసీదా పరిచయం ఉంది. రాఘవేంద్రరావు వద్ద శిష్యుడిగా ఉన్న సమయంలో రాజమౌళి శాంతినివాసం సీరియల్ కు దర్శకత్వం వహించే ఛాన్సును సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే రమకు రాజమౌళికి పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు దర్శకుడిగా వ్యవహరించే సమయానికి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే.. అప్పటికే రమకు పెళ్లై ఒక కొడుకు ఉన్నాడు. దీంతో.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇంట్లోని వారందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సినిమా కుటుంబం కావటంతో బయట హడావుడి లేకుండా చాలా సాదాసీదాగా పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

పెళ్లి తర్వాత తమకు పిల్లలు పుడితే.. కార్తికేయను సరిగా చూడలేనన్న ఆలోచనతో పిల్లలు వద్దన్న నిర్ణయానికి వచ్చారు. అయితే.. తర్వాతి కాలంలో ఒక ఆడపిల్లను దత్తత తీసుకొని ఆమెను పెంచుకుంటున్నారు. ప్రేమకు అసలుసిసలు నిర్వచనంగా రాజమౌళి కనిపిస్తారు. తాను ప్రేమించిన వారి కోసం తన ప్రేమ మొత్తాన్ని ఇవ్వటమే కానీ.. తీసుకోవటం లాంటిది ఆయన దగ్గర అస్సలు కనిపించదు.