షాకింగ్.. కరోనా మీద పదేళ్ల ముందే సినిమా

కరోనా.. కరోనా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాలు ఈ పేరునే జపిస్తున్నారు. ఆ జపం ఇష్టంతో చేస్తున్నది కాదు.. భయంతో చేస్తున్నదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు నెలల కిందట చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాల్లో విస్తరించి.. ఆయా దేశాల ప్రజల్ని అల్లాడించేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పదేళ్ల కిందట ప్రపంచాన్ని భయపెట్టిన స్వైన్ ఫ్లూను మించి ఈ వైరస్ ఎన్నో రెట్లు ప్రాణాంతకంగా పరిణమించి జనాల్ని వణికిస్తోంది.

ఈ వైరస్ లక్షణాలు.. అది విస్తరించే వైనం ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఉండటంతో జనాలు మరింత భయానికి గురవుతున్నారు. ఐతే కేవలం మూడు నెలల కిందట చైనాలో పుట్టిన ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన సంకేతాలు పదేళ్ల కిందటే ఓ సినిమాలో రావడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సినిమా పేరు.. కంటేజియాన్. 2010లో తెరకెక్కిన ఈ చిత్రం 2011లో హాలీవుడ్లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు అమెరికాలో యాపిల్ ఐట్యూన్స్ స్టోర్లో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన సినిమాల జాబితాలో కంటేజియాన్ ఉంది. ఈ పేరుతో గూగుల్లో విస్తృతంగా సెర్చ్ నడుస్తోంది. ఈ సినిమాలో నటి పాల్ట్రో పోషించిన పాత్ర చైనా పర్యటనలో ఉండగా ఓ కొత్త వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతుంది.

గబ్బిలం ద్వారా వ్యాప్తి చెందే ఆ వైరస్.. ఓ పందికి సోకుతుంది. ఆ పంది మాంసాన్ని తానిక ఓ హాంకాంగ్ చెఫ్ప.. పాల్ట్రోకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. దీంతో ఆమెకు వైరస్ సోకి చనిపోతుంది. తర్వాత కొన్నాళ్లకే కొడుకూ ప్రాణాలు వదులుతాడు. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ లక్షణాలు కూడా అచ్చంగా ఇలాగే ఉండి వరుసగా జనాలు ప్రాణాలు కోల్పోతుండటంతో పదేళ్ల కిందట ఇలా ఊహించి ఎలా సినిమా తీయగలిగారంటూ ప్రపంచవ్యాప్తంగా జనాలు ఆశ్చర్యపోతున్నారు.