అఖిల్ మీదికి ఇంకో ఎటాక్

లేక లేక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్తో ఒక హిట్టు కొట్టాడు అక్కినేని కుటుంబ యువ కథానాయకుడు అఖిల్. ఆ సినిమాకు కూడా ఫుల్ పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు కానీ.. రిలీజ్ టైమింగ్ సహా అన్నీ కలిసొచ్చి ఆ సినిమా బాగానే ఆడింది. అఖిల్ పెర్ఫామెన్స్ విషయంలో అంత అప్లాజ్ ఏమీ రాకున్నా.. మూడు డిజాస్టర్ల తర్వాత మొత్తానికి అతడి ఖాతాలో తొలి హిట్ అయితే పడింది.

ఈ ఊపులో ఒక భారీ చిత్రం చేస్తున్నాడతను. అదే.. ఏజెంట్. సురేందర్ రెడ్డి లాంటి టాప్ లీగ్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. అనిల్ సుంకర ఈ చిత్రం మీద దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది కచ్చితంగా అఖిల్ మీద మోయలేని భారమే. కాకపోతే ఇటు ట్రేడ్లో అటు యూత్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే బాక్సాఫీస్ దగ్గర ఏజెంట్కు అంత అనుకూల పరిస్థితులైతే కనిపించడం లేదు.

ఏజెంట్ మూవీ ఆగస్టు 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ వీకెండ్లో అంతకంతకూ ఏజెంట్కు పోటీ పెరిగిపోతోంది. ఆల్రెడీ నాగచైతన్య ప్రత్యేక పాత్ర పోషించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా అదే వారాంతంలో విడుదల కాబోతోంది.

చైతూ నటించడానికి తోడు ఇది ఆమిర్ ఖాన్ మూవీ కావడంతో దక్షిణాదిన మంచి అంచనాలతోనే విడుదల కానుంది. మరోవైపు సమంత సినిమా యశోద ఆగస్టు 12న నేరుగా అఖిల్ మూవీతో పోటీ పడబోతోంది. ఈ పోటీ చాలదన్నట్లు ఇప్పుడు ఇంకో ఆసక్తికర సినిమా ఆగస్టు 12 రేసులోకి వచ్చింది.

అదే.. మాచర్ల నియోజకవర్గం. అఖిల్ను తన బేనర్ ద్వారా హీరోగా పరిచయం చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్న నితిన్.. తన సొంత బేనర్లోనే చేసిన కొత్త సినిమాను అఖిల్ మూవీకి పోటీగా దించబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని జులై 8న రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ ఆ టైంకి సినిమా రిలీజ్ చేయడం కష్టమనుకున్నారో ఏమో.. నెల రోజులకు పైగా వాయిదా వేసి ఆగస్టు 12కు ఫిక్స్ చేస్తున్నారు. ఇన్ని సినిమాల పోటీ మధ్య అఖిల్ మూవీ ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.