ఏపీ- టీజీ ప్రభుత్వాలు ఆదుకోవాలి: బాలకృష్ణ

నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ అఖండ డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా `అఖండ` ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇకపై విడుదల కానున్న అన్ని సినిమాలకు ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ ప్రభుత్వాలు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. కోవిడ్-19 రాకతో ఎదురైన అనేక సవాళ్లను టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ధైర్యంగా ఎదుర్కొని సినిమాలు తీశారని.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని ప్రోత్సహించాలని బాలయ్య అన్నారు.

తన మిత్రుడు అల్లు అరవింద్ కుమారుడు.. హీరో అల్లు అర్జున్ తన ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందని బాలయ్య అన్నారు. రాజమౌళి గురించి బాలయ్య మాట్లాడుతూ.. RRR దర్శకుడిని చూసి దేశమే కాదు ప్రపంచం మొత్తం గర్వపడుతుందని అన్నారు. బాలయ్య కూడా అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను గురించి సినిమా విశేషాలపైనా గొప్పగా మాట్లాడాడు.

స్టార్ హీరో బాలకృష్ణ మునుముందు విడుదల కానున్న పుష్ప- ఆర్.ఆర్.ఆర్ – ఆచార్య వంటి భారీ చిత్రాలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు. ఏపీ లో సవరించిన టికెట్ ధరలపై మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. టికెట్ ధరలను సందర్భానుసారం పెంచుకునే వెసులుబాటు కల్పించాలని చిరు అన్నారు. పరిశ్రమకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహకం కావాలని కోరారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా అఖండ వేదికగా ప్రభుత్వాలను ప్రోత్సాహకం అభ్యర్థించారు.