చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇద్దరూ అవి ‘రద్దు’ చేసుకుంటారా.?

వున్నపళంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ‘స్టే’లను రద్దు చేయించుకోవాలట. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల డిమాండ్. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వున్న పళంగా బెయిల్ రద్దు చేసుకోవడంతోపాటు, అక్రమాస్తుల కేసులో పూర్తిస్థాయి వేగవంతమైన విచారణను కోరాలి..’ అన్నది తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఒకరేమో ‘స్టే’ బాబు.. అంటారు. ఇంకొకరేమో, ‘బెయిల్’ జగన్.. అంటారు. ‘‘ఇందులో రెండూ నిజమే.

చంద్రబాబు మీద ఎన్ని కేసులు నమోదైనా, ఆయన ఎంచక్కా ‘స్టే’లు తెచ్చేసుకుంటారు. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, జైలుకు వెళ్ళి వచ్చిన వైఎస్ జగన్, ‘బెయిల్’ మీద వుండి.. ఇతరుల అవినీతి గురించి మాట్లాడతారు.. ఇద్దరూ రాష్ట్రానికి పట్టిన చీడ.. ఈ ఇద్దరూ కలిసి ఓ మాట మీద నిలబడి.. ఒకరు స్టేలు రద్దు చేయించుకుని.. ఇంకొకరు బెయిల్ రద్దు చేయించుకుని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..’’ అంటూ మరికొందరు ఉచిత సలహా ఇస్తున్నారు.

బెయిల్ కావొచ్చు, స్టే కావొచ్చు.. రెండూ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రక్రియలో కొన్ని వెసులుబాట్లు. న్యాయ స్థాలు దేన్నీ ఊరికినే ఇచ్చేయవు. దానికి బోల్డంత కథ నడుస్తుంది. కోర్టులో వాదనలకు అనుగుణంగానే ‘స్టే’ లభించడం.. ‘బెయిల్’ లభించడం అనేది ఆధారపడి వుంటుంది. చంద్రబాబుని వైఎస్ జగన్ విమర్శించేస్తే అది నిజమైపోదు. వైఎస్ జగన్, చంద్రబాబుని విమర్శిస్తే అది నిజమైపోదు.

కేసులు పెట్టినంతమాత్రాన నేరస్తులు కాదని అక్రమాస్తుల కేసు విషయమై వైసీపీ చెబుతుంటుంది. మరి. ఆ లెక్కన, చంద్రబాబు ఎలా దోషి అవుతారు.? అదంతే. ఎవరికి వారు కన్వీనియెంట్‌గా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇలాంటి చర్యలపై న్యాయస్థానాలే ‘సుమోటో’గా ఆయా రాజకీయ నాయకులపై స్పందించాలేమో.!