వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు.. జాకీలేసి లేపుతోన్న వైఎస్సార్సీపీ.!

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు.. ఇది తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పేరు కనిపించడంలేదు. ఔను, కనిపించదు కూడా. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వుంటే వైసీపీ వుండాలి.. లేదంటే టీడీపీ వుండాలి. నిజానికి, 2019 ఎన్నికల్లో టీడీపీ దాదాపుగా చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. పంచాయితీ ఎన్నికల సమయంలో అదే నిరూపితమయ్యింది కూడా. అయినాగానీ, టీడీపీకి జాకీలేసి పైకి లేపే ప్రయత్నం అధికార వైఎస్సార్సీపీ చేస్తోంది.

టీడీపీ తరఫున ఏవైనా రాజకీయ ఆందోళనలు జరిగితే చాలు, పోలీసులు వాటికి నానా రకాల ఆటంకాలూ సృష్టిస్తారు. అదే వైసీపీకి చెందిన నేతలు ఆందోళనలు చేపడితే, వాటికి పోలీసుల నుంచి ఎలాంటి ప్రతిఘటనా వుండదు. ఈ చర్యల ద్వారా టీడీపీని ప్రభుత్వం నిలువరించే ప్రయత్నం చేస్తోందా.? లేదంటే, ముందస్తు ఓవరాక్షన్ వల్ల తలెత్తే గర్షణ కారణంగా టీడీపీకి మైలేజ్ వచ్చేలా వైసీపీ ప్రభుత్వం చేస్తోందా.? ఈ ప్రశ్న సామాన్యుడిలో కలగడం సహజమే.

అమరావతి కుంభకోణం పేరుతో చంద్రబాబు చుట్టూ వైసీపీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. రెండున్నరేళ్ళవుతోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. ‘మేం అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేష్ జైలుకెళతారు..’ అని చెప్పిన ఆనాటి వైసీపీ మాటలేమయ్యాయ్.? ఆ కుంభకోణాల్లో నిజాల నిగ్గు తేలేదెప్పుడు.? ఏ విషయంలో అయినా కోర్టులు ప్రభుత్వానికి మొట్టికాయలేస్తే చాలు, కోర్టుల్ని చంద్రబాబు మేనేజ్ చేసేస్తున్నారంటూ అక్కడా చంద్రబాబు జపమే చేస్తున్నారు వైసీపీ నేతలు.

కేంద్రం గనుక ఏదన్నా అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలేస్తే, ఇక్కడా బాబు మంత్రాంగమే పనిచేసిందని ఆరోపించడం వైసీపీకి పరిపాటిగా మారిపోయింది. జనసేన పార్టీ పోరాడితే, చంద్రబాబు ఆదేశానుసారం.. అంటారు వైసీపీ నేతలు. వైసీపీ పాలనని బీజేపీ విమర్శించినా అది చంద్రబాబుకే అంటగట్టే ప్రయత్నం బులుగు నేతలు చేస్తున్నారు. టీడీపీ పనైపోయిందంటూనే, ప్రతిదానికీ టీడీపీ జపం చేయడం వైసీపీకి అలవాటైపోయింది.

జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు, వామపక్షాలు కావొచ్చు.. ఏ రాజకీయ పార్టీ ఉనికి కూడా వుండకూడదు.. కేవలం తమతోపాటు టీడీపీ ఉనికి మాత్రమే వుండాలన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఎన్నాళ్ళిలా వైసీపీ – టీడీపీ కలిసి ‘మూకుమ్మడి రాజకీయం’ చేస్తాయి.? రాష్ట్ర ప్రజల్ని ఇంకెన్నాళ్ళు వంచిస్తాయి.? టీడీపీకి జవసత్వాలు నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నుంచి తెరవెనుకాల అందుకుంటున్న ‘ప్యాకేజీ’ ఏంటి.? ఏమో, బులుగు పార్టీనే సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకి.