ఇదేం రాజకీయం.? ప్రజల ప్రాణాల కంటే, ఎన్నికలే ముఖ్యమా.?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో వుంది. రోజురోజుకీ కరోనా పాజిటివిటీ రేటు గణనీయంగా పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి. ఆక్సిజన్ సమస్య, మందుల కొరత.. ఇలా ఎటు చూసినా కరోనా భయాలే. కానీ, కొందరు రాజకీయ నాయకులకి అలాంటి భయాలేవీ లేవు. ఎందుకంటే, వాళ్ళందరికీ ఎన్నికలే ముఖ్యం. రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలకూ, కార్పొరేషన్లకూ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో రాజకీయ పార్టీల హంగామా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

‘మా ఇంటికి రావొద్దు.. ఓట్లు అడగొద్దు..’ అంటూ కరోనా నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్ళ ముందు బోర్డులు పెడుతున్నా, రాజకీయ ప్రముఖుల రోడ్ షోలు కొనసాగుతున్నాయి. ఇంటింటి ప్రచారాలూ జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం కోసం జనాన్ని సైతం బాగానే సమీకరిస్తుండడం గమనార్హం. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారనే ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్.. ఇద్దరూ హోం ఐసోలేషన్ పొందుతున్నారు. మరికొందరు రాజకీయ ప్రముఖులూ కరోనా బారిన పడ్డారు. ఆయా పార్టీలకు చెందిన నేతలే కాదు, కార్యకర్తలు, సామాన్యులు కూడా ఎన్నికల కారణంగా కరోనా బారిన పడుతున్న పరిస్థితిని చూస్తున్నాం.

అయినాగానీ, రాజకీయ పార్టీలకీ, నాయకులకీ ఎన్నికలే ముఖ్యమైపోయాయి. ఎన్నికల ప్రచారం సందర్బంగా కరోనా నిబంధనలు పాటించాల్సి వున్నప్పటికీ, నిబంధనలు బేఖాతరవుతున్నాయి. ఫేస్ మాస్కులు పెట్టుకుంటున్నారుగానీ, అవి వుండాల్సిన రీతిలో వుండడంలేదు. కరచాలనాలు, ఆలింగనాలు.. అన్నీ జరుగుతున్నాయి. ఇదీ కరోనా రాజకీయ భారతం.