ఎన్టీఆర్ ని అలా చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ గోండు బెబ్బులి కొమురం భీంగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించేలా చేసింది.

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వసూళ్ల పరంగా తెలుగు సినిమా సత్తాని మరోసారి యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఈ సినిమాలో ముందు నుంచి చెప్పినట్టుగా ఇద్దరు స్టార్ హీరోల పాత్రలని సమానంగా చూపిస్తానని అన్నారు కానీ అది జరగలేదు. ఇందులో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ పాత్రని పొడిగించి కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ పాత్రని తగ్గించారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రాజమౌళిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అంతే కాకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధాన్ని ప్రకటించి పెద్ద రచ్చకు తెరలేపిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పాత్రని తగ్గించారని ఆసంతృప్తిలో వున్న ఫ్యాన్స్ కు ఇటీవల రాజమౌళి ఇచ్చిన వివరణ ఎన్టీఆర్ కీలక సన్నివేశంలో పలికించిన హావ భావాల గురించి జక్కన్న వివరించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఫ్యాన్స్ ఈ వివరణకు సంతృప్తిని వ్యక్తం చేయకపోయినా కొంత వరకు శాంతించారు.

ఇటీవల కోట అన్నమాటలు ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తరహాలో ప్రొటెన్షియాలిటీ వున్న నటుడు లేరని అతని స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ అంటూ ఇటీవల సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ ప్రశంసలు మరువక ముందే లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వీ కె. విశ్వనాథ్ .. హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. గత కొంత కాలంగా సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్ సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. వయో భారం కారణంగా ఆయన ఇంటి పట్టునే వుంటున్నారు.

సినిమాలకు దూరమైనా ఇండస్ట్రీకి మాత్రం దగ్గరగానే వుంటున్నారు. ఇటీవలే ఆయన ట్రిపుల్ ఆర్ చూశారని తెలిసింది. ఇందులో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అభినయించిన తీరుకు ఆయన ఎమోషనల్ అయ్యారట. మరీ ముఖ్యంగా ‘కొమురం భీముడో ..’ పాటలో ఎన్టీఆర్ నటనకు కె. విశ్వనాథ్ స్పెల్ బౌండ్ అయ్యారట. అదే విషయాన్ని ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మరీ ప్రశంసించారట. ఈ వార్త ఇప్పడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది. తమ హీరో పాత్రని తగ్గించారని గత కొన్ని రోజులుగా ఫీలవుతున్న ఫ్యాన్స్ తాజా ప్రశంసల నేపథ్యంలో ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం.