కంగ‌నా ధైర్య సాహ‌సాల‌కి యంగ్‌ హీరో ఫిదా

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అత్యంత పాపుల‌ర్ వ్య‌క్తి అయ్యారు. కేవ‌లం సినీ అభిమానుల‌కి మాత్ర‌మే ప‌రిచ‌య‌మైన కంగ‌నా…ఇప్పుడు రాజ‌కీయ‌, సామాజిక రంగాల్లోని ప్ర‌ముఖుల‌కు కూడా బాగా ద‌గ్గ‌ర‌య్యార‌నే చెప్పొచ్చు.

సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత నెపోటిజంపై కంగ‌నా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఇదే సంద‌ర్భంలో ఆమెపై కూడా కొంద‌రు ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు. అంత వ‌ర‌కూ ఇదేదో సినిమా వాళ్ల గొడ‌వ‌గా ఉన్న వ్య‌వ‌హారం…ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ట‌ర్న్ తీసుకొంది.

ముంబ‌య్‌పై కంగ‌నా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆమె క్ష‌మాప‌ణ చెప్పాల‌ని శివ‌సేన ఎంపీ డిమాండ్‌తో వివాదం మ‌రింత రాజుకున్న‌ట్టైంది. ముంబ‌య్‌పై త‌న అభిప్రాయాల్ని వెన‌క్కి తీసుకోక‌పోగా …. మ‌రింత ఘాటుగా స్పందించారామె. చివ‌రికి కంగ‌నా కార్యాల‌యాన్ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప‌డ‌గొట్టే వ‌ర‌కు వెళ్లింది. దీంతో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్‌పై ఆమె తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగారు. “మీ అహం కూలే ఒక రోజు వ‌స్తుంది” అని ఆమె ఘాటుగా స్పందించారు.

ఈ పోరాటంలో కంగనాకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ ప‌రంప‌ర‌లో కంగ‌నాకు కోలీవుడ్‌ యంగ్‌ హీరో విశాల్ మద్దతుగా నిలిచారు. ఈ సంద‌ర్భంగా విశాల్‌ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. కంగనాను భగత్‌సింగ్‌తో పోల్చడం విశేషం. విశాల్ రాసిన లేఖ‌లో ఏముందంటే…

“డియర్‌ కంగనా.. నీ ధైర్య సాహసాలకి హ్యాట్సాఫ్. ఏది కరెక్ట్, ఏది రాంగ్‌ అనేది మీరు రెండుసార్లు ఆలోచించలేదు. మీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని మీరు ఎదుర్కొంటున్నారు. 1920లో భగత్‌ సింగ్‌ ఎలా అయితే నిలబడ్డాడో అలా ధైర్యంగా మీరు నిలబడ్డారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే.. ప్రజలు ఎలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడవచ్చో చూపించారు. సెలబ్రిటీలే కాదు సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. వాక్‌ స్వాతంత్ర్య‌ హక్కు (ఆర్టికల్‌ 19) గుర్తు చేశారు. మీకు అభినందనలు” అని విశాల్‌ తన లేఖలో పేర్కొన్నారు.

కంగ‌నాకు విశాల్ లాంటి వాళ్లు మ‌ద్ద‌తు తెల‌ప‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. ఇంకా ఇలాంటి ధోర‌ణి పెర‌గాలి. మ‌రింత మంది ఆమెకు అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం స‌మాజ శ్రేయ‌స్సు దృష్ట్యా కూడా ఎంతో ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.