Karthika Deepam Serial 30th January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 717 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 718 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 30) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

మౌనిత పాయిజన్ ఇన్‌జెక్షన్ శ్రావ్యకు ఇస్తుందని దీప కంగారు పడుతూ అందరికీ చెబుతుంది. (మౌనిత కావాలనే దీపని పిచ్చిదాన్ని చేసి తను మంచిది అనిపించుకోవాలని.. దీప ఊహించుకునేలా ప్రవర్తిస్తుంది) ఇంతలో రిజ్వానా ‘అసలు ఎవరు ఈమె? చెప్పరేంటీ? ఎందుకింత న్యూసెన్స్ చేస్తుంది?’ అంటుంది. అంతా మౌనంగా ఉంటారు. వెంటనే హిమ కోపంగా.. ‘మా వంటలక్క’ అంటుంది. అందంగా గమనిస్తున్న సౌర్యకు ఆవేశం తన్నుకొస్తుంది. ‘మీరు రక్తం అమ్ముకోవడానికి వచ్చినదానికి రక్తం అమ్ముకుని వెళ్లాలి. చాలకపోతే ఇంకా అడగాలి. అంతే కానీ ఇలా లేనిపోనివి మాట్లాడి గొడవ పెడతావా?’ అంటూ తిడుతుంది రిజ్వానా దీపను. అప్పుడు కూడా ఎవ్వరూ నోరు మెదపకపోవడంతో సౌర్య రగిలిపోతుంది. ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

వెటకారం… కోపం..

సీన్ కట్ చేస్తే.. దీప, సౌందర్య, ఆనందరావులు హాస్పిటల్‌లో ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘హిమ ఏది అత్తయ్యా?’ అంటుంది దీప. ‘వాళ్ల నాన్నతో కలిసి వెళ్లిపోయిందమ్మా’ అంటాడు ఆనందరావు. అప్పుడే వారణాసిని వెంట పెట్టుకుని వచ్చిన సౌర్య.. ఆ మాటలు విని…. ‘హా అవును.. మీ మనవరాలు.. వాళ్ల నాన్నతో వెళ్లిపోయింది కదా?’ అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ‘ఏమైంది దీనికి ఇలా మాట్లాడుతుంది?’ అంటాడు ఆనందరావు. ‘అమ్మా వెళ్దామా?’ అంటుంది సౌర్య. ‘అమ్మా… వెళ్దామా?’ మరో సారి రెట్టిస్తుంది.

సౌర్య ఆవేశం..

‘ఏమైంది అత్తమ్మా ఇలా మాట్లాడుతున్నావ్?’ అంటూ దీప అనగానే.. ‘అత్తమ్మా అని నువ్వు పిలిచినట్లే.. ఈ మేడమ్(సౌందర్య) నీ అత్తగారినని ఆ డాక్టర్ అడుగుతుంటే ఎందుకు చెప్పలేదమ్మా?’ అంటుంది. ఆ ప్రశ్నకు సౌందర్య షాక్ అవుతుంది. దీప సౌర్యని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. ‘అవునూ రక్తం అమ్ముకున్నావా? ఎంత డబ్బులు వచ్చాయమ్మా?’ అనే సరికి దీప కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.

ఎవరూ వద్దమ్మా..

‘అసలు వీళ్లేంటో నాకు ఎప్పుడు అర్థం కారేంటమ్మా? ఏమే సెల్ఫ్ రెస్పెక్టూ అంటుంది ఈమె. అమ్మా దీపా అంటూ వస్తాడు ఆ తాతయ్య. నోరు మెదపరు కానీ చూసి ఏడుస్తారు. ఎవరైనా ఉంటే మాత్రం.. నువ్వు ఎవరో.? నేనే ఎవరో? వాళ్లు ఎవరో అన్నట్లుగా ఉండిపోతారు.. ఎందుకమ్మా? అసలు వీళ్లంతా మనకు వద్దమ్మా’ అంటుంది సౌర్య ఆవేశంగా.. సౌందర్య, ఆనందరావులు బాధగా అలా నిలబడి చూస్తూ ఉంటారు. దీప సౌర్యకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది.

వస్తావా లేదా?

‘అసలు..? నువ్వు ఎవరు అని అడిగితే వీళ్లంతా నోరు మెదపలేదేంటమ్మా? అదే ఆ శ్రావ్య పిన్నిని ఎవరైనా.. ఈమె ఎవరు? అంటే మా కోడలు అని చెప్పుకుంటారు కదా? నిన్ను రక్తం అమ్ముకునే దాన్ని చేశారు. వద్దమ్మా ఇక్కడుండొద్దు. మనకు ఇక్కడెవ్వరూ లేరు. వెళ్దాం రా అమ్మా..’ అంటుంది సౌర్య. బాధగా దీప సౌందర్య వైపు చూస్తుంటే.. ‘వస్తావా లేదా?’ అంటుంది సౌర్య కోపంగా. అప్పటికీ దీప కదలకపోవడంతో.. ‘నువ్వు రా’ అంటూ లాక్కుని వెళ్లిపోతుంది.

సౌందర్య ఆవేదన..

దీపని లాక్కుని పోవడంతో సౌందర్య.. బాగా ఏడుస్తుంది. ఆనందరావు కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ‘ఎంత బాగా తిట్టిందండీ.. నన్ను నేనే తిట్టుకున్నట్లుగా ఉంది. దాని తప్పు ఏంలేదండీ.. నా పెద్ద కోడలని చెప్పాలనుకున్నానని. హిమని చూసి ఆగిపోయానండీ.. వంటలక్కే దీపని. దీప నా పెద్ద కోడలని హిమకి తెలిస్తే.. వాడు(కార్తీక్) పెద్ద రాద్దాం చేసేస్తాడని భయపడి నోరు విప్పలేదండీ’ అంటూ బాగా ఏడుస్తుంది.

కార్తీక్ పిచ్చి నవ్వు..

హిమ కార్తీక్‌లు కారులో వెలుతూ ఉంటారు. దీప హాస్పిటల్‌లో చేసిన గొడవని తలుచుకుంటూ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ‘డాడీ నీకో సంగతి తెలుసా? వంటలక్క పేరు దీప అంట. అమ్మ పేరు కూడా దీపే కదా.. నాకు ఇన్ని రోజులు తెలియనే తెలియదు..’ అంటుంది హిమ కూల్‌గా.. కార్తీక్ ఆవేశాన్ని ఆపుకుంటూ నవ్వుతాడు. ‘ఎందుకు నవ్వుతున్నావ్ డాడీ’ అంటుంది హిమ అర్థం కాక. ‘పిచ్చి హిమ.. పేరులో ఏముందిరా? శ్రీనువాసు, నాగులు ఇలా పేర్లు చాలా మందికి ఉంటాయి’ అంటాడు కార్తీక్. హిమ వింటూ ఉంటుంది.

అంత మాత్రాన్ని ఆ కార్తీక్ డాక్టర్ అయిపోతాడా?

కార్తీక్ చెబుతూ ఉంటాడు. ‘దీప పేరు కూడా చాలా మందికి ఉంటాయి. అంతెందుకు మన మౌనిత ఆంటీ పని మనిషి లేదూ? ప్రియమణి.. తన మెడలో గొలుసు కొట్టేసిన దొంగ లేడు. వాడి పేరు కార్తీక్ అంట. అంత మాత్రాన్న ఆ కార్తీక్ డాక్టర్ అయిపోతాడా? నేను దొంగనైపోతానా?’ అంటాడు కార్తీక్ నవ్వుతూనే. ‘ఇందంతా నాకెందుకు చెబుతున్నావ్ డాడీ?’ అంటుంది హిమ అయోమయంగా చూస్తూ..

డాడీ.. నాకో డౌట్..?

‘కదా గుమ్మడకాయల దొంగ అనగానే భుజాలు తడుముకోవడం అంటే ఇదేనేమో..’మనసులో అనుకుంటూ ఇబ్బందిగా నవ్వుతాడు. వెంటనే హిమ.. కార్తీక్‌తో.. ‘డాడీ.. నాకో డౌట్, మౌనిత ఆంటీ దొంగని దొంగతనం చేస్తుంటే చూసి పట్టుకుందా?’ అని అడుగుతుంది. ‘అవును..’ అంటాడు కార్తీక్. ‘మరి ఇందాక వంటలక్క కూడా మౌనిత ఆంటీని ఏదో దొంగ పని చేస్తుంటే పట్టుకుని ఉంటుందిగా?’ అంటుంది డౌట్‌గా..

మరి వంటలక్కా..

కార్తీక్ కారు సడన్‌గా ఆపుతాడు. ‘ఎందుకు ఆపావు డాడీ?’ అంటుంది హిమ. ‘ఇల్లు వచ్చినా ఆపకూడదా?’ అంటూనే.. ‘నువ్వు దిగు హిమ.. హాస్పిటల్‌లో చిన్న పని ఉంది.. చూసుకుని వస్తాను’ అంటాడు కార్తీక్. ‘మరి వంటలక్కా..’ అంటూ హిమ సాగదీస్తుంటే.. కార్తీక్ దన్నం పెట్టి.. ‘దిగమ్మా.. వెళ్లాలి’ అంటూ హిమని దించి వెళ్లిపోతాడు. హిమ కోపంగా దిగి ఇంట్లోకి నడుస్తుంది.

పైకి రారా ఒకసారి..

చీకటి పడిన తర్వాత.. సౌందర్య బాధతో పైన అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఆనందరావు వచ్చి.. ‘సౌందర్య.. ఇప్పుడు వాడ్ని ఏం అనకు. వాడు తిరిగి మాట్లాడుతుంటే.. మన పెద్దరికం పోతుంది.’ అంటాడు. కార్తీక్ కారు సౌండ్ వినిపిస్తుంది. ‘ఏం కాదులేండీ’ అంటూనే కార్తీక్‌కి ఫోన్ చేసి.. కిందకి కార్తీక్ వైపు చూస్తూ.. ‘పైకి రారా ఒకసారి’ అంటుంది. కార్తీక్ ఫోన్ పెట్టేసి.. ‘అయిపోయింది. తెలుగు తిట్లు వినాల్సిందే’ అనుకుంటూ పైకి నడుస్తాడు కూల్‌గా..

పాపం పిచ్చి హిమ…

దీప సౌర్యకు అన్నం పెడుతూ ఉంటుంది. సౌర్య మాత్రం ఆ కోపాన్ని అలానే కంటిన్యూ చేస్తుంది. ‘అసలు కూరలో కారమే లేదు’ అంటూ అరుస్తుంది. వెంటనే దీప తిని చూసి.. ‘నువ్వు కారంగా ఉన్నావ్‌గా అందుకే నీకు కారం తెలియట్లేదు’ అంటుంది నవ్వుతూ.. వెంటనే కంచం పక్కన పెట్టి.. ‘అసలు నాన్నకి నువ్వంటే ఎందుకు కోపమే చెప్పవు. పోనీ హిమా వాళ్ల అమ్మ గురించి కూడా చెప్పవు. పాపం పిచ్చిది.. అమ్మ గురించి తెలియక రోజూ బాధపడుతుంది..’ అంటుంది ఆవేశంగా సౌర్య.

హిమకి చెప్పేస్తా..

‘హిమ అమ్మని నేనే అని దానికీ చెప్పుకోలేను.. నీకు చెప్పుకోలేను..’ అంటూ మనసులోనే బాధపడుతుంది దీప. ‘అసలు హిమతో.. మీ నాన్నే మా నాన్న అని చెప్పేస్తాను.. అప్పుడు హిమే.. వాళ్ల అమ్మవు నువ్వే అనుకుని.. వాళ్ల అక్కని నేను అని అర్థం చేసుకుని డాక్టర్ బాబుని ఒప్పించి తీసుకుని వెళ్తుంది’ అంటుంది సౌర్య ఆవేశంగా..

అసలు ఆ డాక్టర్ బాబు..

‘అంత పని మాత్రం చెయ్యకు అత్తమ్మా.. ఇప్పుడు నిన్ను నన్నే అసహించుకున్న డాక్టర్ బాబూ.. అలా చేస్తే హిమని కూడా అసహించుకుంటాడు. పాపం హిమ.. దాన్నైనా ప్రశాంతంగా ఉండనివ్వు..’ అంటుంది దీప బాధగా.. ‘అదీ నిజమే..’ అన్న సౌర్య.. మళ్లీ మాట్లాడుతూ.. ‘అసలు ఆ డాక్టర్ బాబు..’ అని మొదలుపెడుతుంది. వెంటనే దీప కోపంగా.. ‘అత్తమ్మా ఇంకేం మాట్లాడకు తిను’ అని కసురుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.