‘మా’ అధ్యక్షుడి మౌనం ఎందుకో..?

లో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండస్ట్రీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు దర్శకు నిర్మాతలు ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. ఏపీ సర్కారు నిర్దేశించిన టికెట్ రేట్లతో కరెంట్ బిల్లులు కూడా కట్టలేమని పలువురు ఎగ్జిబిటర్స్ థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ క్రమంలో మంత్రిని కలిసి ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇంత రచ్చ జరుగుతున్నా.. ఇప్పటి వరకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సినిమా టికెట్ రేట్ల వ్యవహారం – థియేటర్లు మూసివేత అంశాలు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మంచు విష్ణు ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ విషయమై కనీసం ఓ ట్వీట్ కూడా చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ తో బంధుత్వం వల్లే విష్ణు మౌనం వహిస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఇండస్ట్రీ సమస్యలపై ప్రశ్నించే హక్కు విష్ణుకు ఉంది. అదే సమయంలో ప్రభుత్వం మీద సినీ ప్రముఖులు చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం అని పేర్కొనాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది.

సినీ పరిశ్రమలో నెలకొన్న అంశాలపై పలువురు హీరోలు – దర్శక నిర్మాతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల ఇండస్ట్రీలోనే కాకుండా ప్రజల్లో కూడా కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలకు ఇండస్ట్రీకి మధ్య అగాధం వచ్చిందనే విధంగా అందరూ మాట్లాడునే సిచ్యుయేషన్ వచ్చింది. ఇలాంటి సమయంలో ‘మా’ అధ్యక్షుడు సంధానకర్తగా వ్యవహరించి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా టికెట్ ధరల మీద చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందని అంటున్నారు.

ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ కూడా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పని మాట్లాడారు. టికెట్ రేట్లు తగ్గడం వలన నష్టపోయేది హీరోలు కాదని.. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే అని ఆర్జీవీ అన్నారు. కానీ ఇంతవరకు మంచు విష్ణు స్పందించకపోవడంపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల వ్యవహారం మీద ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని విషయాలను పరిశీలించి కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి సర్కార్ ఓ డెసిషన్ తీసుకోనుంది. మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ‘మా’ అధ్యక్షుడు దీనిపై స్పందిస్తారేమో చూడాలి.