పర్సనల్ ముచ్చట.! విష్ణు ఇప్పుడెందుకు వచ్చాడట.?

సినిమా థియేటర్లు ఆంధ్రప్రదేశ్‌లో మూతపడినప్పుడు మంచు విష్ణు ఆచూకీ కనిపించలేదు. సినిమా టిక్కెట్ల వివాదంలో, ‘సినీ జనాలు బలిసి కొట్టుకుంటున్నారు..’ అంటూ వైసీపీ నేతలు ఘాటైన కామెంట్లు చేసినప్పుడు, మంచు విష్ణు స్పందించలేదు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా మంచు విష్ణు, ‘పర్సనల్’ వ్యాఖ్యలు చేసేశారు.

మెగాస్టార్ చిరంజీవిని ముందు పెట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సినీ పరిశ్రమలో కొందరు ముఖ్యులు తెరవెనుక పావులు కదుపుతున్నారు.

‘నేను పరిశ్రమ పెద్దగా వుండలేను. అయితే, పరిశ్రమ సమస్యల విషయంలో పరిశ్రమ బిడ్డగా స్పందిస్తాను, నాకు చేతనైనంత సాయం చేస్తాను..’ అన్న మాటకు కట్టుబడి చిరంజీవి, మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.

దానికి కొనసాగింపుగా, పరిశ్రమలో ‘సమస్యలపై చర్చ’ జరగడం, అన్ని విషయాలపైనా ఖచ్చితమైన అవగాహనతో, ఓ నివేదిక తయారు చేసుకుని, దాన్ని చిరంజీవి ద్వారా ఏపీ ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలనే వ్యూహాన్ని పరిశ్రమ ముఖ్యులు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

సరిగ్గా ఈ సమయంలోనే మంచు విష్ణు, ‘పర్సనల్’ అంటూ మీడియా ముందు ఏదేదో మాట్లాడేశారు. చిరంజీవి, పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడితే, అది పర్సనల్ ఎలా అవుతుంది.?

నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ విషయంలో వివాదం తలెత్తినప్పుడు ఏ ఛాంబర్, ఆ సమస్యకు పరిష్కారం చూపించింది.? నాని మీద వైసీపీ నేతలు విరుచుకుపడినప్పుడు, ఏ ‘మా’ స్పందించింది.? సమస్య పట్ల బాధ్యతాయుతంగా స్పందించరు కదా, ఇంకెవరన్నా స్పందిస్తే ఎగతాళి చేయడం సినీ పరిశ్రమలో అలవాటే.

అందుకే, సినీ పరిశ్రమ.. తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ ప్రభుత్వాల్ని దేబిరించాల్సి వస్తోంది.