2022లో పవన్ నుంచి నాలుగు సినిమాలు..!

‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. చాలా గ్యాప్ తీసుకుని ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కంబ్యాక్ ఇస్తూనే అర డజను సినిమాలకు కమిట్ అయ్యారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్న జనసేన అధినేత పవన్.. వరుస పెట్టి కొత్త సినిమాలను ప్రకటిస్తున్నారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ చేస్తూ.. ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లలో పాల్గొంటున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు – బోనీకపూర్ నిర్మాణంలో రూపొందిన ‘వకీల్ సాబ్’ సినిమా గత ఏప్రిల్ నెలలో విడుదలై మంచి విజయం సాధించింది. కరోనా నేపథ్యంలో కలెక్షన్స్ కాస్త తగ్గినప్పటికీ పవన్ కు తగిన కంబ్యాక్ మూవీగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ”హరి హర వీరమల్లు” అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నారు. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పవన్ కు ఫస్ట్ హిస్టారికల్ మూవీ.. ఆయనకెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్న పవన్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఇదే క్రమంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో దగ్గుబాటి రానా తో కలిసి ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ తెలుగు రీమేక్ సినిమా చేస్తున్నారు పవన్. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – మాటలు అందించడంతో పాటుగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కరోనా సెకండ్ వేవ్ తర్వాత తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇందులో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించనుంది.

అయితే ‘#PSPKRana’ చిత్రాన్ని ఈ ఏడాది వినాయక చవితికి విడుదల చేసి.. ‘హరి హరవీరమల్లు’ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ లేట్ అవడంతో అన్నీ తారుమారు అయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాలను వచ్చే ఏడాదే రిలీజ్ చేయాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఏకే’ రీమేక్ సంక్రాంతి కి వస్తే.. ఇప్పటికే 45 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘వీర మల్లు’ చిత్రాన్ని 2022 సమ్మర్ నాటికి రెడీ చేస్తారని అంటున్నారు.

ఇదిలా ఉండగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ ‘#PSPK28’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని పవన్ చూస్తున్నారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాని కోవిడ్ పరిస్థితులు లేకపోతే ఈపాటికే ప్రారంభించేవారు. కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ ని బట్టి కాస్త లేట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎంత నిదానంగా చిత్రీకరణ జరిపినా ‘పవన్ – హరీష్’ మూవీ 2022 వేసవి సమయానికి కంప్లీట్ అవుతుంది. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకోవచ్చు.

ఈ క్రమంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్నాడు. పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభించి.. దసరా సమయానికి పూర్తి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ మూవీ 2022 చివరలో విడుదలకు సిద్ధం అవుతుంది. మొత్తం మీద ఎలాంటి అడ్డంకులు రాకపోతే 2022లో పవన్ నుంచి నాలుగు సినిమాలు విడుదల అవుతాయి. సంక్రాంతి కి ‘#PspkRana’.. సమ్మర్ లో ‘వీరమల్లు’.. సెకండాఫ్ లో ‘#PSPK28’.. ఇయర్ ఎండింగ్ లో సురేందర్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో ఓ ప్రాజెక్ట్.. జె.పుల్లారావు నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి పవన్ అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం.