మనోభావాలు దెబ్బ తింటున్న ఈ బ్యాడ్ డేస్ లో వివాదాలేల హరీషా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీఎస్ పీకే 29 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. పోస్టర్ తోనే పవన్ అభిమానుల్లో వేడి పెంచాడు. ఈ కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి కలిసి వస్తున్నారు కాబట్టి రెట్టింపు అంచనాలేర్పడ్డాయి. ఇప్పటికే గబ్బర్ సింగ్ ని మించి ఉంటుందని హరీష్ సంకేతాలు అందించారు. ఇంతలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్టేడ్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.

`భవదీయుడు`తో టైటిల్ క్లోజ్ చేయాలా? లేక కొనసాగింపు గా భగత్ సింగ్ ని తగిలించాలా? అన్న దానిపైనా సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి కొంత మంది ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని.. మరో కొత్త టైటిల్ తో పవన్ బరిలోకి రానున్నారన్న గుసగుసలు లేకపోలేదు. మరి ఇందులో వాస్తవాలు తేలితే తప్ప! టైటిల్ పై క్లారిటీ రాదు. ఇదంతా పక్కనబెడితే భగత్ సింగ్ ని టైటిల్ లో జోడించడం అన్నది పెద్ద సాహసమనే చెప్పాలి. మనోభావాలు దెబ్బ తింటున్న ఈ సీజన్ లో ఇలాంటి టైటిల్ దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగాను మారే అవకాశం లేకపోలేదు.

తెలుగు రాష్ట్రాల్లో భగత్ సింగ్ వేడుకల్ని వారసులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున రాజధాని నగరాల్లో సందడి నెలకొంటుంది. ప్రతిచోటా తల్వార్ మయమై కనిపిస్తుంది. రాజధాని పొడవునా భారీ ఎత్తున బైక్ లు.. కార్ల ర్యాలీలు నిర్వహిస్తారు. ఇలాంటి టైటిల్స్ పెట్టడానికి పవన్ కూడా ఎంతమాత్రం ఆసక్తి చూపించరని వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్ లో నటిస్తున్నారు. దీనికి `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేం సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు 2022 సంక్రాంతికి విడుదలవుతుంది. ఈలోగానే భీమ్లానాయక్ చిత్రీకరణ శరవేగంగా పూర్తయిపోతోంది. ఇది వచ్చే సమ్మర్ కి వచ్చే వీలుందని అంచనా. హరీష్ తో సినిమాని ప్రారంభించి అటుపై సురేందర్ రెడ్డితోనూ పని చేసేందుకు పవన్ సన్నాహకాల్లో ఉన్నారు.

పవన్ స్క్రిప్టు అంటే మాయావి తప్పనిసరా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దర్శకుడు ఎవరైనా కానీ త్రివిక్రమ్ పెన్ను పడాల్సిందేనా? అంటూ ఇటీవల మరో కొత్త డిస్కషన్ వేడెక్కిస్తోంది. ఇప్పటికే పవన్ నటిస్తున్న సినిమాలన్నిటికీ త్రివిక్రమ్ పర్యవేక్షకుడిగా రచనా సమీక్షకుడిగా ఉన్నారు. స్నేహితుడు త్రివిక్రమ్ గొప్ప రైటర్ కావడంతో పవన్ అతన్ని ఎక్కువగానే నమ్ముతారు. బాలీవుడ్ సినిమా `పింక్` చిత్రాన్ని `వకీల్ సాబ్` టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది వేణు శ్రీరామ్. కానీ కథలో మార్పులు చేర్పులు చేసింది త్రివిక్రమ్.

ప్రస్తుతం పవన్ సాగర్ చిత్రం దర్శకత్వంలో మలయాళం సినిమా `అయ్యప్పునం కోషియమ్` ని `భీమ్లా నాయక్` టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ భాగస్వామ్యం బహిరంగమే. వకీల్ సాబ్ తర్వాత `భీమ్లా నాయక్` కి మాత్రం డైరెక్ట్ గా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు త్రివిక్రమ్. ఇంకా దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయనే. సాగర్ చంద్ర వెనుకుండి కథంతా నడిపించేది త్రివిక్రమ్.

తాజాగా మాటల మాంత్రికుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా క్రియేటివ్ మేకర్ క్రిష్ కి సాయమందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే పిరియాడిక్ చిత్రంలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భారీ పోరాట సన్నివేశాలు ఉన్నాయి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా పవన్ క్యారెక్టరైజేషన్ సాగుతుంది. సముద్ర మార్గం ద్వారా చొరడబడిన కంపెనీ ప్రతినిధులుపై దండెత్తే క్రమంలో పీకే పాత్ర బ్రిటీష్ లా ప్రకారం చట్ట విరుద్దంగానూ సాగుతోంది. అయితే ఈ సన్నివేశాల విషయంలో పవన్ అసంతృప్తిగా ఉన్నారని… ఆ కారణంగా కొన్ని మార్పుల బాధ్యతల్ని త్రివిక్రమ్ కి అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలకు త్రివిక్రమ్ సూచనలు ఉంటాయని తెలిసింది.