పుష్ప మరింత లేటు?

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో రెడీ కావాల్సిన సినిమా పుష్ప. కరోనా బారిన పడిన అనేకానేక సినిమాల్లో ఇదీ ఒకటి. కరోనాకు ముందు ఈ సినిమాను కేరళలో ప్లాన్ చేసారు. ముందుగా కరోనా అక్కడ విజృంభించడంతో ఇక్కడ ఎక్కడైనా చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడా కరోనా వ్యాపించేసింది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అస్సలు ఇంట్లోంచి బయట కాలు పెట్టడం లేదు. ఎవర్నీ కలవడం లేదు.

ఇప్పుడు మెల్లగా కరోనా తగ్గుముఖం పడుతోంది. షూటింగ్ లు ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు అన్నీ నవంబర్ నుంచి సెట్ మీదకు వెళ్తాలని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, సర్కారువారి పాట నవంబర్ నుంచే ప్రారంభం అవుతున్నాయి. అయితే పుష్ప విషయంలో మరి కాస్త ఆలస్యం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం మళ్లీ కేరళకే వేళ్దాం అని దర్శకుడు సుకుమార్ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఇక్కడ చేసి రాజీ పడవద్దని, కేరళలోని దట్టమైన అడవులకే వెళ్దామని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. అలా అయిన పక్షంలో పుష్ప మరింత ఆలస్యం కాక తప్పదు. ఎందుకంటే క్రూ మొత్తం కేరళ వెళ్లడం, కరోనా జాగ్రత్తలు, అనుమతులు ఇలాంటి వ్యవహారాలు చాలా వుంటాయి.

పుష్ప సినిమా 2021 సమ్మర్ కు రావాలని అనుకుంటోంది. షూటింగ్ ఓ నెల అటు ఇటు అయినా ఈ డేట్ అందుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు.