పుష్పరాజ్ పాత్ర తీరుతెన్నులు అలా ఉంటాయా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ స్టైలిష్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన బన్నీ ని.. సుకుమార్ ఈ చిత్రంలో మొరటుగా ఉండే లారీ డ్రైవర్ పుష్పరాజ్ అనే పాత్రలో చూపిస్తారు. ఇందులో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడి అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ ద్వారా పుష్ప రాజ్ పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయో హింట్ ఇచ్చారు. బన్నీ లుక్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ ను మరింత ఎగ్జైట్ చేసే ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్ ని ఇంతవరకు చూడని కొత్త అవతారంలో చూపిస్తున్న సుకుమార్.. పుష్ప రాజ్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ను చూపించబోతున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు మొదటి భాగంలో నెగిటివ్ షేడ్స్ తో సాగే ఈ పాత్ర రెండో పార్ట్ లో సరికొత్తగా మారుతుందని అంటున్నారు. అలానే గంధపు చక్కలు స్మగ్లింగ్ చేసే సన్నివేశాలు.. మిగతా యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేస్తాయని చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే బన్నీ అభిమానులను అలరించడానికి తనను కొత్తగా అవిష్కరించుకుంటున్నాడని అర్థం అవుతోంది.

‘పుష్ప’ చిత్రంలో ప్రతినాయకుడిగా మలయాళ నేచురల్ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – యాంకర్ అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

‘పుష్ప-1’ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన మేకర్స్.. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ని ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ఏకధాటిగా 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపి మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నారు. పార్ట్-1 రిలీజ్ అయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘పుష్ప 2’ పనులు మొదలు పెట్టనున్నారు. ఆ లోపు అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ చిత్రాన్ని కంప్లీట్ చేసుకుంటారు.

‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ – సుకుమార్ ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అల వైకుంటపురములో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బన్నీ.. ‘పుష్ప 1’ చిత్రంతో నేషనల్ వైడ్ సత్తా చాటుతాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.