‘శంకర్ – చరణ్’ సినిమాలో హైలైట్ గా నిలిచే ట్రైన్ ఫైట్..!

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో చరణ్ ఓ ప్రభుత్వోద్యోగిగా కనిపించనున్నారని అనౌన్స్మెంట్ పోస్టర్ ని బట్టి తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు దాదాపు 200 కోట్ల బడ్జెట్ కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలానే ఈ సినిమాలో గూస్ బమ్స్ తెప్పించే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని శంకర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

RC15 చిత్రంలో రామ్ చరణ్ కోసం శంకర్ ఓ ట్రైన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట. వందమందికి పైగా ఫైటర్లు పాల్గొనే ఈ యాక్షన్ సీక్వెన్స్ లో చరణ్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో చూపించబోతున్నారట. ప్రముఖ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో ఈ ఫైట్ షూట్ చేయబడుతుంది. దీని కోసం సుమారు పది కోట్లు ఖర్చు చేయబోతున్నారట. ఇదే కనుక నిజమైతే యాక్షన్ సీన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టే శంకర్.. ట్రైన్ సీక్వెన్స్ ని అద్భుతంగా ఆవిష్కరిస్తారనడంలో సందేహం లేదు. అయితే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చరణ్ ట్రైన్ మీద నిలబడి చేసిన సీన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. శంకర్ సినిమాలో వచ్చే ట్రైన్ ఫైట్ తో అందరూ చెర్రీ గత చిత్రంలోని సన్నివేశాన్ని మర్చిపోతారేమో చూడాలి.

కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన ఈ 50వ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహ నిర్మాత. ఇందులో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. అంజలి – సునీల్ – శ్రీకాంత్ – జయరామ్ – నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి – అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. తిరు సినిమాటోగ్రాఫర్ గా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రూపొందే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.