రష్మికకు కోట్లు మా వల్ల కాదన్నారట

గీత గోవిందం చిత్రంతో తెలుగులో ఒక్కసారిగా రష్మిక బిజీ అయ్యింది. ఆ సినిమాకు రష్మిక తీసుకున్న పారితోషికం చాలా తక్కువ. కాని ఆమె ఆ తర్వాత తన పారితోషికంను పెంచుతూ పోయిన విధానం అందరికి ఆశ్చర్యం అనిపించక మానదు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది భీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో సక్సెస్‌ అందుకున్న రష్మిక మందన్న తన పారితోషికంను ఏకంగా రెండు కోట్లకు పెంచేసిందట. ఈ విషయంలో ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని అనుకుంది. కాని కరోనా ఆమె ఆశలపై నీళ్లు జల్లింది.

తెలుగు మరియు తమిళంలో కలిపి ఈమె ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్‌ అయ్యింది. ఆ సినిమాల స్థాయిని బట్టి 1.25 కోట్ల నుండి 1.8 కోట్ల వరకు పారితోషికం ఒప్పందం చేసుకుందట. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితల నేపథ్యంలో అంత పారితోషికం ఇవ్వలేమంటూ నిర్మాతలు చేతులు ఎత్తేశారట. ప్రస్తుతం ఉన్న విపత్తు నేపథ్యంలో సినిమాల నిర్మాణమే కష్టం. కనుక హీరోలు పారితోషికాలు తగ్గించుకుంటున్నారు. హీరోయిన్స్‌ కూడా తమ బాధ్యతగా పారితోషికాలు తగ్గించుకోవాలంటూ నిర్మాతలు కోరుతున్నారు.

రష్మిక ఇప్పటికే కమిట్‌ అయిన మూడు సినిమాల పారితోషికాలను 20 నుండి 40 శాతం వరకు తగ్గించుకోవాల్సి రావచ్చు అంటున్నారు. ఒక వేళ ఆమె అంతే మొండి పట్టుదలతో ఉంటే మాత్రం ఖచ్చితంగా సినిమాలు చేజారే అవకాశం ఉంది అంటున్నారు. ఇక కొత్తగా ఆఫర్లు ఇవ్వాలనుకునే వారు ఆమెకు కేవలం కోటి మాత్రమే ఆఫర్‌ చేస్తున్నారట.

ఆ కోటికి ఓకే చెప్తే మరో రెండు సినిమాలు ఆమె ఖాతాలో పడనున్నాయి. లేదంటే ఇప్పట్లో ఆమెకు ఆఫర్లు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఈ విపత్తు నేపథ్యంలో రష్మిక మందన్న పారితోషికం విషయంలో రాజీ పడనుందా లేదంటే మొండిగా వ్యవహరించి సినిమాలు పోగొట్టుకుంటుందా చూడాలి.