#గుసగుస.. షాకిస్తున్న RRR పబ్లిసిటీ బడ్జెట్!

సౌతిండస్ట్రీలో సినిమాల ప్రమోషన్స్ కి ఖర్చు చేస్తున్న మొత్తాల్ని చూస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే. ఒక చిన్న సినిమా తీసి బడ్జెట్ లోనే రిలీజ్ చేసేయొచ్చు. ఇంతకుముందు 2.0 .. రోబో చిత్రాల ప్రమోషన్స్ కి అంత భారీగా ఖర్చు చేయించారు శంకర్. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి ప్రమోషన్స్ కోసం కోట్లలోనే ఖర్చు చేశారు. బాహుబలి -1 .. బాహుబలి 2 గ్రాండ్ సక్సెస్ వెనక రాజమౌళి – ఆర్కా మీడియా పబ్లిసిటీ ప్లాన్ తో పాటు వెచ్చించిన బడ్జెట్టు కూడా ఒక కారణమని చెబుతారు.

ఇప్పుడు మరోసారి ఆర్.ఆర్.ఆర్ కోసం మరోసారి అత్యంత భారీ బడ్జెట్ తో ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి టీమ్. జనవరిలో సినిమా రిలీజవుతోంది కాబట్టి నవంబర్ – డిసెంబర్ ఆద్యంతం ప్రచారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్లాన్ ని డిజైన్ చేస్తున్నారని తెలిసింది. ప్రత్యేకించి ఓ చార్టర్ ఫ్లయిట్ ను బుక్ చేసుకుని ప్రధాన మెట్రో నగరాల్లో ప్రమోషన్స్ చేయాలని భావిస్తున్నారట. ఇందులో ముంబై-హైదరాబాద్ సహా బెంగళూరు-చెన్నై ఉన్నాయి. ఇటు ఉత్తరాంధ్రను కవర్ చేసేలా విశాఖ పట్నంలోనూ భారీ ప్రమోషన్స్ చేయనున్నారు. ఇకపై వరుస ఈవెంట్ల కోసం కథానాయకులు చరణ్ – తారక్ ని కూడా బరిలో దించుతారట.

ఈ ప్లానింగ్ అంతా చూస్తుంటే మినిమంగా 20కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేయడం గ్యారెంటీ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ ఎల్.ఇ.డి స్క్రీన్లు.. గ్రౌండ్ క్లియరెన్స్ పర్మిషన్లు.. భారీ సెట్లు .. అలాగే స్టార్ల ప్రయాణాల కోసం చార్టర్ ప్లైట్ అంటే ఖర్చు తడిసిమోపెడు అవుతుంది. అందుకే కోట్లాది రూపాయలు కేవలం పబ్లిసిటీకే కేటాయించే వీలుంటుందని కథనాలొస్తున్నాయి. అలాగే బాలీవుడ్ లోనూ పలు క్రేజీ టీవీ షోలతో పాటు సోషల్ మీడియా పీఆర్ వ్యవస్థకు చెల్లింపుల కోసం భారీ మొత్తాన్ని కేటాయించనున్నారని తెలుస్తోంది.

భారీ వసూళ్లే లక్ష్యంగా రిస్కులు

ఆర్.ఆర్.ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ కి తగ్గట్టే ప్రచారం అవసరమని చిత్రబృందం భావిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ బిజినెస్ పెద్ద రేంజులో సాగింది. అందుకు తగ్గట్టే ఆర్.ఆర్.ఆర్ కూడా భారీ వసూళ్లను తేవాల్సి ఉండగా ప్రచారం కీలకం కానుందన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమా ప్రీబిజినెస్ ఇప్పటికే పూర్తయిందని కథనాలొచ్చాయి. స్వదేశంలో దిగ్గజ సంస్థలు భారీగా చెల్లింపులు చేయనుండగా.. విదేశీ హక్కుల కోసం కోట్లాది రూపాయల డీల్ కుదిరింది. `ఆర్.ఆర్.ఆర్` ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దాదాపు 400 కోట్ల వరకూ ఖర్చు అయిందని గుసగుసలు వినిపిస్తున్నా డిలే వల్ల వడ్డీ కలిపితే మరో 150 కోట్లు అదనంగా ఖర్చు అయిందని సమాచారం. కోవిడ్ సహా రకరకాల కారణాలతో ఈ పరిస్థితి తలెత్తిందని గుసగుస వినిపించింది. మొత్తంగా ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్ 550 కోట్లు అయిందని ప్రచారం సాగుతోంది. ఇది పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతున్న చిత్రం. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు-హిందీలో మాత్రమే తెరకెక్కించారు. మిగతా భాషల్లో అనువాదమవుతుంది. అంటే దాదాపు స్వదేశంలో అన్ని భాషల్లోనూ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతోంది.

ఇంకా ఇతర దేశాల్లో `బాహుబలి` తరహాలోనే అనువాదం కానుంది. అంటే ఈ లెక్కన బాక్సాఫీస్ బరిలోకి 1000 కోట్ల పైబడిన వసూళ్ల టార్గెట్ తో బరిలోకి దిగాలి. అప్పుడే ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్… లాభాలు ఆశించడానికి అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం హిందీ రైట్స్ ..శాటిలైట్ రైట్స్ పెన్ స్టూడియోస్ కి కట్టబెట్టారు. పోర్చుగీస్..కొరియన్..టర్కీష్.. స్పానిష్ భాషల డిజిటల్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ కి అమ్మేసారు. తెలుగు..తమిళం..కన్నడం..మలయాళం డిజిటల్ హక్కుల్ని జీ-5కి కట్టబెట్టారు. ఎన్నికోట్లకు ఇప్పటివకూ బిజినెస్ జరిగిందన్నది తేలాల్సి ఉంది. అయితే 550 కోట్ల బడ్జెట్ నడుమ దర్శక నిర్మాతలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని గుసగుస వినిపిస్తోంది. 2022 సంక్రాంతి రేసులో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రచారం కోసం భారీ బడ్జెట్లు కేటాయించినా దానికి తగ్గట్టే క్రేజు పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.