ఈ సమయంలో జనాలను థియేటర్లకు రమ్మనడం కరెక్టా?

వెంకటేష్ హీరోగా సురేష్‌ బాబు నిర్మించిన నారప్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మొదట ఈ సినిమాను థియేటర్ ద్వారా విడుదల చేయాలని భావించినా కూడా థియేటర్లు ఓపెన్‌ లేని కారణంగా ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యారు. అయితే మరి కొన్ని రోజులు ఆగి ఉంటే థియేటర్లు ఓపెన్‌ అయ్యేవి అప్పుడు హ్యాపీగా థియేటర్లలో సినిమాను విడుదల చేసి ఉంటే బాగుండేది కదా అంటూ సురేష్‌ బాబును కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. సురేష్‌ బాబు నారప్ప సినిమాతో పాటు దృశ్యం 2 ను కూడా ఓటీటీకి అమ్మేశాడు.

థియేటర్ల విషయంలో కనీస బాధ్యత లేకుండా సురేష్‌ బాబు వ్యవహరించాడు అంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకు జనాలను రప్పించే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా బాధ్యతారాహిత్యం అవుతుంది. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో తాము ఓటీటీకి వెళ్లాల్సి వస్తుంది అంటూ ఈ సందర్బంగా సురేష్ బాబు అన్నాడు. కరోనా కేసులు ఈ స్థాయిలో పెరుగుతున్నా కూడా థియేటర్లు నడిపించాలనుకోవడం కరెక్ట్ కాదని కూడా అన్నాడు. పరిస్థితులు అన్ని చక్క బడ్డ తర్వాత ఖచ్చితంగా మళ్లీ థియేటర్లకు మంచి రోజులు వస్తాయనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు.