డిమాండ్ కు తగ్గట్టుగానే థమన్ రెమ్యూనరేషన్ పెంచేశారా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఎస్ఎస్ థమన్. గత రెండేళ్లుగా సూపర్ ఫార్మ్ లో ఉన్న తమన్.. ట్రెండీ మ్యూజిక్ తో శ్రోతలకు మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందిస్తూ దూసుకుపోతున్నారు. పాటలే కాకుండా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తారనే పేరు తెచ్చుకున్నారు.

కేవలం థమన్ వల్లనే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే స్టార్ హీరోలు – దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయారు. ప్రస్తుతం థమన్ చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయంటేనే అతను ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు థమన్ వర్క్ చేసే పెద్ద సినిమా ఆడియో రైట్స్ దాదాపు 5 కోట్లు పలుకుతున్నాయంటేనే అతని సంగీతానికి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది.

దీనికి తగ్గట్లుగానే థమన్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసారనే టాక్ ఉంది. ఇదే విషయాన్ని థమన్ వద్ద ప్రస్తావిస్తే.. నిర్మాతలే తన పనితనానికి తగిన పారితోషికం ఇస్తున్నారని.. తానెవరినీ ఇంత కావాలని ఎప్పుడూ అడగలేదని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో థమన్ తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడారు.

”నా వర్క్ చూసి ప్రొడ్యూసర్స్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు.. సినిమాకు ఇంత కావాలని నేను ఎప్పుడూ ఎవరినీ డిమాండ్ చేయలేదు. చేయను. నా హార్డ్ వర్క్ కు తగిన ఫలం దక్కుతుందని నేను నమ్ముతాను. అందులోనూ నాకు మొహమాటం భయం ఎక్కువ. అందుకే ఎవరినీ డిమాండ్ చేయలేను”

”ఫస్ట్ మనం వర్క్ బాగా చేస్తే ప్రొడ్యూసర్స్ కు డబ్బులు వస్తాయి. అంతకంటే సంతోషం ఏముంటుంది? వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ కు అవకాశం ఇస్తున్నారు అంటే అది గొప్ప కదా.. ప్రొడ్యూసర్స్ గొప్పవాళ్ళు. కరోనా టైంలో ఎంత నష్టపోయినా సినిమా మీద ప్యాషన్ తో మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అందుకే వాళ్లకు మనం సపోర్ట్ చెయ్యాలి” అని థమన్ చెప్పుకొచ్చారు.