వివి వినాయక్… ముందు చిరు, ఆ తర్వాత బాలయ్య!

వివి వినాయక్ దర్శకుడిగా తన ఫామ్ ను కోల్పోయాడు. గత కొన్నేళ్లుగా వినాయక్ నుండి నిఖార్సైన సినిమా రాలేదు. చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెం 150ను తెరకెక్కించాడు వినాయక్. అది సూపర్ హిట్ అయింది కూడా. అయితే అది రీమేక్ సినిమా కావడంతో వినాయక్ కు కొత్తగా వచ్చిన మైలేజ్ అంటూ ఏం లేదు. అలాగే ఖైదీ నెం 150 తర్వాత తెరకెక్కించిన సినిమా కూడా ఫెయిల్ అయింది. ఈ మధ్య హీరోగా శీనయ్య అంటూ ప్రయత్నాలు చేసాడు కానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే ఉంది. తిరిగి దర్శకత్వం పై ఫోకస్ చేసాడు వినాయక్.

మళ్ళీ చిరంజీవి నుండే పిలుపొచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చేయమని అడిగాడు చిరు. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ వర్క్స్ నడుస్తున్నాయి. తన రైటర్స్ ఆకుల శివ, సాయి మాధవ్ బుర్రా కలిసి ఈ సినిమాను చిరు స్టైల్ కు తగ్గట్లుగా మలుస్తున్నారు.

ఇక మరోవైపు బాలయ్య నుండి కూడా వినాయక్ కు పిలుపొచ్చిందని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి రెండేళ్ల క్రితమే పనిచేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. బోయపాటి శ్రీనుతో సినిమా పూర్తయ్యాక వినాయక్ తో చేయాలని భావిస్తున్నాడు బాలయ్య. మరి చూడాలి అది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో.