జస్ట్ఆస్కింగ్: రాజన్న రాజ్యమంటే ఏంటి.?

ఆంధ్రపదేశ్‌లో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోంది.. అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ‘మా మా ప్రాంతాలకు లోబడి మేం రాజకీయాలు చేస్తున్నాం..’ అంటూ సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదాల గురించి షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ రాజన్నరాజ్యం తీసుకురాలేకపోతే, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు, వైఎస్సార్సీపీని ఆంధ్రపదేశ్‌లో ఓడిస్తారు.. అందుకు ఇంకా మూడేళ్ళ సమయం వుంది.. అని చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. ఇంతకీ రాజన్న రాజ్యమంటే ఏంటి.? ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో, ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడేంత ఘనంగా పోలీసు వ్యవస్థలో వైఫల్యాలు పెరగడమా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు రాజన్న రాజ్యానికి సంకేతాలా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.

ప్రత్యేక హోదా సాధించలేకపోవడం, కేంద్రానికి బాకా ఊదడం రాజన్న రాజ్యం తాలూకూ నిదర్శనాలా.? అన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇంతకీ, రాజన్న రాజ్యమంటే ఏంటి.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడుతూనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజన్న రాజ్యం.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు మొదలెట్టారు. అసలు రాజన్నరాజ్యం.. అంటే వైఎస్సార్ పాలనలో ఏం జరిగింది.? అని లెక్క తీస్తే, నో డౌట్.. పేదలకు సంక్షేమ పథకాలు మెరుగ్గా అమలయ్యాయి. ఆరోగ్యశ్రీ అమల్లోకి వచ్చింది. పీజు రీ-ఎంబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలిగారు.

పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స జరగడం షురూ అయ్యింది. కానీ, అదే వైద్యం.. ప్రజల్ని దోచేయడం మొదలైంది కూడా ఆరోగ్యశ్రీ తెరపైకొచ్చాకనే. డొల్ల చదువులకు కారణం ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ అన్నదీ నిర్వివాదాంశం. ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేక ప్రభుత్వాలు వెర్రి చూపులు చూసే దుస్థితీ కళ్ళ ముందే కనిపిస్తోంది.

ఇక, ఇసుకనీ, మట్టినీ లాభసాటి వస్తువులుగా చూడటం కూడా రాజన్న పాలనలోనే మొదలైంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడటమూ రాజన్న రాజ్యం పుణ్యమే. అన్నిటికీ మించి.. తెలుగు నాట విభజన రాజకీయాలూ రాజన్న రాజ్యంలోనే మొదలయ్యాయి. మళ్ళీ ఇప్పుడు రాజన్న రాజ్యమంటే.. జనం ఒకింత భయాందోళనలకు గురవడం సహజమే మరి.