కూతురుకి సూపర్‌ స్టార్‌ అరుదైన…!

తమిళ సూపర్‌ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ గత చిత్రం జైలర్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

తమిళ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా భారీగా లాల్ సలామ్ సినిమాను విడుదల చేశారు. సినిమా విడుదల నేపథ్యంలో రజినీకాంత్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ఎక్స్ ద్వారా తన కూతురుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తన కూతురు ఐశ్వర్య తో ఉన్న ఒక అరుదైన ఫోటోను రజినీ షేర్ చేశాడు. వీల్ చైర్‌ లో రజినీకాంత్ కూర్చుని ఉండగా, ఆ చైర్ ను ఐశ్వర్య నడిపిస్తూ ఉన్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన తల్లి ఐశ్వర్య అంటూ రజినీకాంత్‌ ఎమోషనల్‌ గా పోస్ట్‌ చేయడం చూస్తుంటే కూతురు అంటే రజినీకి ఉన్న ప్రేమ అభిమానం ఎంత ఉందో తెలుస్తుంది.

లాల్ సలామ్ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో రజినీకాంత్ ముస్లిం మతస్తుడిగా కనిపించాడు. సినిమా లో రజినీకాంత్‌ కనిపించేది కొద్ది సమయం అయినా కూడా కథ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే లాల్ సలామ్ కోసం రజినీకాంత్‌ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.