ఇండియాలో తొలి కరోనా మృతి?

కరోనాను మహమ్మారిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించి రోజే.. ఇండియాలో ఈ వైరస్ పట్ల భయాన్ని పెంచే పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కరోనా వల్ల ఓ వ్యక్తి మృతి చెందినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. కర్ణాటకలో కరోనా బాధితుడొకరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఆ వ్యక్తి వయసు 76 ఏళ్లని చెబుతున్నారు. పేరు తెలియలేదు.

కర్ణాటకలోని కాలబురాగికి చెందిన ఆ వ్యక్తి ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చాడు. అక్కడే ఆయనకు కరోనా సోకింది. ఇండియాకు వచ్చాక విషయం బయటపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఐతే క్రమంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆ వ్యక్తి ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. వయసు మీద పడటం.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ఆ వ్యక్తి చనిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. సదరు వ్యక్తి మంగళవారమే చనిపోగా.. విషయం గురువారం బయటకు పొక్కింది. ఈ వార్త కరోనా బాధితుల్లోనే కాక అందరిలోనూ ఆందోళన పెంచేదే.

దేశ్యవాప్తంగా ఇప్పటిదాకా 60కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రా ప్రాంతంలోని నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు తేలింది. ఆ వ్యక్తి ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని కరోనా కేసులంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిపై స్పష్టత లేదు.