ఏపీ జ‌నాల‌కు జ‌గ‌న్ లిక్క‌ర్ షాక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద‌శ‌ల‌వారీగా సంపూర్ణ మ‌ద్య నిషేధం తీసుకొస్తా అని ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్న‌పుడు చాలామంది కామెడీగానే తీసుకున్నారు. మ‌ద్య‌పానం వాడ‌వాడ‌లకూ బాగా విస్త‌రించి.. అమ్మ‌కాలు ఎన్నో రెట్లు పెరిగి.. ప్ర‌భుత్వ ఆదాయానికి మ‌ద్యం అమ్మ‌కాలు పెద్ద వ‌న‌రుగా మారిన నేప‌థ్యంలో నిషేధం అమ‌లు చేయ‌డం అసాధ్య‌మ‌నే అభిప్రాయంతోనే మెజారిటీ జ‌నాలున్నారు.

ఐతే అధికారంలోకి వ‌చ్చాక మ‌ద్యం అమ్మ‌కాల్లో నియంత్ర‌ణ తీసుకొచ్చి కొంత‌మేర చిత్త‌శుద్ధిని చాటుకున్నాడు జ‌గ‌న్. వైన్ షాపుల్లో అమ్మ‌కాల వేళ‌లు కుదించారు. బార్ల టైమింగ్స్ కూడా త‌గ్గాయి. అందుకు త‌గ్గ‌ట్లే ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాలూ త‌గ్గాయి. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు మ‌ద్య నిషేధం విష‌యంలో సీరియ‌స్‌గానే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇదంతా ఒకెత్త‌యితే.. ఇప్పుడు ఏపీలో 20 రోజుల పాటు పూర్తిగా మ‌ద్యం అమ్మ‌కాలు ఆగిపోతుండ‌టం విశేషం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మ‌ద్యం, డ‌బ్బు ప్ర‌భావం ఉండ‌కూడ‌దంటూ సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల ఖ‌రాఖండిగా చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ నెల 12 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాలు ఆపేస్తున్న‌ట్లు మంత్రి అనిల్ కుమార్ ప్ర‌క‌టించారు. అప్పుడెప్పుడో 80-90 ద‌శకాల మ‌ధ్య ఎన్టీఆర్ హ‌యాంలో మ‌ద్యం నిషేధం అమల‌య్యాక మ‌ళ్లీ ఏపీలో ఇలా మ‌ద్యం అమ్మ‌కాలు ఆగిపోవ‌డం ఇదే తొలిసారి.

ఐతే స్థానిక సంస్థల ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌ద్యం అమ్మ‌కాల్ని ఆపేయ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు వ్యూహం ఉంద‌న్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికార పార్టీ త‌లుచుకుంటే త‌మ మ‌ద్ద‌తు దారుల‌కు, కార్య‌కర్త‌ల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌డం క‌ష్ట‌మేమీ కాదు. దొడ్డిదారిలో త‌మ వాళ్ల‌కు మ‌ద్యం దొరికేలా చేసి.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు మ‌ద్యం దొర‌క్కుండా చేసి ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం పొందేందుకే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌న్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు విశ్లేష‌కులు.