టిల్లు డైరెక్టర్ ఎందుకు మారాడంటే.. సిద్దు క్లారిటీ!

టాలీవుడ్ సినీ ప్రియుల్లోని కుర్రాళ్లంతా ఎంతో ఎదురుచూస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. రెండేళ్ల క్రితం డీజే టిల్లుతో వచ్చి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక ఊపు ఊపేశారు. ఒక్కసారిగా సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ రాధిక డైలాగులతో పాటు డీజే టిల్లు సాంగ్స్ చాలా ఈవెంట్స్ లో వినిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ మూవీ నచ్చేసింది. ఇక కాస్త గ్యాప్ తీసుకున్న సిద్ధు.. టిల్లు స్క్వేర్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

సమ్మర్ కానుకగా మార్చి 29వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. మరోసారి టిల్లు గాడి సందడి చూసేందుకు కుర్రాళ్లంతా సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని రూమర్లు వచ్చినా.. సెన్సార్ సర్టిఫికెట్ తో వాటికి చెక్ పడింది.

ఇక టిల్లు స్క్వేర్ మూవీని మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యాలు ఇస్తున్నారయన. అయితే డీజే టిల్లుకు విమల్ కృష్ణ.. దర్శకత్వం వహించారు. కానీ సీక్వెల్ కు డైరెక్టర్ మారడంతో ఊహాగానాలు వచ్చాయి. కావాలనే దర్శకుడు మార్చారా లేక విమల్ సీక్వెల్ చేసేందుకే ముందు రాలేదా అని చర్చించుకున్నారంతా. తాజాగా డైరెక్టర్ ఛేంజ్ పై హీరో సిద్దు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చారు.

“టిల్లు స్క్వేర్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. విమల్ కృష్ణ అందుబాటులో లేరు. వేరే చిత్రానికి కమిట్ అయ్యారు. అందుకే ఆయన డైరెక్టర్ గా వ్యవహరించలేదు. ఫస్ట్ పార్ట్ తీసిన వ్యక్తే.. రెండో పార్ట్ తీయాలన్న రూల్ ఎక్కడ లేదు కదా.. ఉదాహరణకు స్పైడర్ మ్యాన్ సిరీస్ లో హీరోలు మారారు. డైరెక్టర్ కన్నా హీరోకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ అందరినీ ఆడియన్స్ ఈక్వల్ గా రిసీవ్ చేసుకున్నారు.

అయితే ఈ మూవీలో నన్ను మార్చలేదు. డైరెక్టర్ మారారు అంతే” అని తెలిపారు సిద్ధు జొన్నలగడ్డ. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నేహా శెట్టి నటించగా.. సీక్వెల్ లో మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ లిల్లీ పాత్రలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈమె నటనపై మేకర్స్ ప్రశంసలు కురిపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సీక్వెల్ లో రాధిక రోల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.