టీడీపీ నుంచి మరో వికెట్.. పార్టీకి కేఈ ప్రభాకర్ గుడ్ బై

స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి షాకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం వీడారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో తన అనుచరులకు టికెట్లు కేటాయించడంలో అన్యాయం జరిగిందనే కారణంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు సైతం టీడీపీపై పెత్తనం చేస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు.

మండల పరిషత్ లోగానీ, జిల్లా పరిషత్ లలో గానీ తాను చెప్పినవాళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. తన మాటకు విలువ లేని పార్టీలో ఉండటం అర్థం లేదన్నారు. అందుకే పార్టీ కార్యకర్తలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. అయితే, ఆయన అధికార వైసీపీలో చేరనున్నారని సమాచారం. మరోవైపు అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా అనుచరులతో మంతనాలు జరిపిన అనంతరం కుమార్తె యామినీ బాలతో కలసి వైసీపీలో చేరాలని శమంతకమణి నిర్ణయించుకున్నట్టు సమాచారం. మండలి రద్దు కావడం ఖాయమని, అప్పుడు ఎలాగూ తమ పదవులు పోతాయని వారంతా నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. టీడీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, అధికార పార్టీలో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పదవి వచ్చే అవకాశం ఉంటేందని భావించే వారు పార్టీని వీడటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా వైసీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, దీనిని ఆయన ఖండించారు. వీరే కాకుండా మరింత మంది టీడీపీ నేతలు పార్టీని వీడటం ఖాయమంటున్నారు.