తెలంగాణలో బాదుడు తప్పదా?

ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నా, మాంద్యం ముప్పు చుట్టూ ఉన్నా, కేంద్రం సహకరించకున్నా ప్రగతి మాత్రం ఆగబోదంటూ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్ స్పష్టంచేశారు. ఇప్పట్లో ఏ ఎన్నికలూ లేవని, అయినప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళతామని పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్ కంటే ఏకంగా రూ.40వేల కోట్ల మేర అదనంగా ప్రతిపాదనలు చేశారు.

మరి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి తెస్తారు అంటే, భూములు, నిరర్థక ఆస్తులు అమ్మేయడం ద్వారా అని తెలుస్తోంది. పన్నేతర ఆదాయాన్ని గత బడ్జెట్ తో పోలిస్తే ఏకంగా రూ.18వేల కోట్లు పెంచి చూపించారు. అంటే ఈ రూ.30వేల కోట్లను భూములు, ఆస్తులు అమ్మడం ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంది. ఇక పన్నుల రాబడి కూడా భారీగానే పెంచారు. అంటే ఆ మేరకు వడ్డింపులు షూరూ కావడం ఖాయమని తెలుస్తోంది. ఎక్సైజ్ ఆదాయంతోపాటు రిజిస్ట్రేషన్ రాబడిని కూడా పెంచుకునే దిశగా ప్రతిపాదనలు చేసింది.

దీనిని బట్టి మద్యం ధరలు పెరగడంతోపాటు భూముల రిజిస్ట్రేషన్ విలువలు సవరించబోతున్నారని స్పష్టమవుతోంది. విద్యుత్ చార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆర్టీసీ చార్జీలు సైతం మరోసారి పెంచే అవకాశం ఉందని సమాచారం. మొత్తమ్మీద ఎలా చూసినా మాంద్యం సాకుతో ఈ ఏడాది ప్రజలపై బాదుడు తప్పదని అర్థమవుతోంది.

మరోవైపు ఎన్నికలు లేకున్నా అభివృద్దే ఎజెండాగా బడ్జెట్ ప్రవేశపెట్టామని హరీశ్ చెప్పినా.. గులాబీ పార్టీ గురి హైదరాబాద్ పై ఉందని తెలుస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి రాజధానిపై గులాబీ జెండా ఎగురవేసే లక్ష్యంతో ఈ బడ్జెట్ లో హైదరాబాద్ కు రూ.10వేల కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో రూ.50వేల కోట్లు కేటాయించనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, జీహెచ్ఎంసీ పీఠాన్ని నిలుపుకోవాలని టీఆర్ఎస్ యోచిస్తోంది.