10 ఎక‌రాల్లో సెట్..200 గుర్రాల‌తో స‌వారీ!

హిట్లున్నా..లేక‌పోయినా కిలాడీ అక్ష‌య్ కుమార్ మాత్రం త‌గ్గేదేలే. విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌తో ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కించ‌డం కిలాడీకే సాధ్య‌మైంది. ఎన్ని విమ‌ర్శలొస్తే అంత‌కంత‌కు ఆస‌క్తిని రేకెత్తించే ప్రాజెక్ట్ లే లైన్ లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే అక్ష‌య్ ఖాతాలో చాలా సినిమాలున్నాయి. అందులో `వెల్ క‌మ్ టూది జంగిల్` ఒక‌టి. అక్ష‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో అహ్మ‌ద్ ఖాన్ తెర‌కెక్కిస్తున్నారు. `వెల్ క‌మ్` ప్రాంచైజీ నుంచి వ‌స్తోన్న మూడ‌వ సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ర‌వీనా టాండ‌న్, దిశాప‌టానీ, జాక్వెలిన్ పెర్నాండేజ్ లాంటి స్టార్ హీరోయిన్లు ఇందులో భాగ‌మే. ఇటీవ‌లే ఓ భారీ యాక్ష‌న్ సీన్వెన్స్ ముంబైలో చిత్రీక‌రిస్తున్నట్లు స‌మాచారం. 10 ఎక‌రాల్లో భారీ సెట్లు నిర్మించి ఈ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారుట‌. ఇందులో 200 గుర్రాల్ని కూడా వినియోగిస్తున్నారుట‌.

యుద్దం నేప‌థ్యంలో అశ్వాలు కూడా అవ‌స‌రం ప‌డ‌టంతో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ఆ స‌న్నివేశాలు చిత్రీ క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏడు రోజుల పాటు ఈ స‌న్నివేశాలు షూట్ చేసిన‌ట్లు సమాచారం. అందుకోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది. అక్ష‌య్ కుమార్ కెరీర్ లోనే భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుగా సినిమాలో హైలైట్ అవుతాయని చిత్ర వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు విదేశీ స్టంట్ మాస్ట‌ర్లు పనిచేసిన‌ట్లు చెబుతున్నారు.

వీటి చిత్రీక‌ర‌ణకు ముందు అక్ష‌య్ ఫైట్స్ సీన్స్ కి సంబంధించి విదేశాల్లో ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకున్నాడుట‌. ఆయ‌న‌కు శిక్ష‌ణ ఇచ్చిన స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలోనే వీటిని చిత్రీక‌రించిన‌ట్లు వినిపిస్తుంది. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి ఇదే ఏడాది క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.