AameKatha Serial December 6th Episode Online

అదో రాజ కోట. ఆ కోటలోని యువరాజు పెద్ద మోసగాడు. ఆస్తీ ఐశ్వర్యం, తల్లీదండ్రీ లేని అందమైన ఆడపిల్లలని ప్రేమించానని నమ్మించి, పెళ్లి చేసుకుని కోటకు తీసుకొస్తాడు. అలా అని ఆ రాజుకి ఆ అమ్మాయిల మీద మోజు లేదు. అతడి మోజులు, ముద్దులూ, మురిపాలూ అన్నీ ఆ కోటలో పని చేసే పనిమనిషి రాణితోనే. మరి ఎందుకు అమాయకురాళ్లైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు? అసలు ఆ రాజు మంచివాడా? చెడ్డవాడా? ఇలా ఒక్కటేమిటి అన్నీ అనుమానాలే. అన్నీ ఆసక్తిని కలిగించే ట్విస్ట్‌లే. ’ఆమె కథ’ ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం!

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

మహేశ్వరి(పద్మిణీ)కి రాణీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. తన భర్త గౌతమ్ అంటే అమితమైన ఇష్టాన్ని చూపించడాన్ని గమనించిన పద్మిణీ కావాలనే.. రాణీని టార్గెట్ చేస్తుంది. కావాలనే గౌతమ్ పనులు చేయమని చెప్పడం, పనిదానిలానే చూస్తూ కావాలనే అడ్డమైన పనులు చెప్పడంతో రాణీ చాలా ఇబ్బంది పడుతుంది. గౌతమ్‌కి కూడా అప్పుడప్పుడు చురకలు వేస్తుంది. ‘కట్టుబాట్లను, ముహూర్తాలను కాదని గౌతమ్ బయటికి వెళ్లినందుకే యాక్సిడెంట్ అయ్యిందని.. ఈ సారైనా చెప్పింది చేయకపోతే.. మరింత ప్రమాదం అని.. ఏడాది లోపి కోట వారసుడు పుట్టి తీరాలని’ రాజ గురువు చెప్పడంతో శ్యామలాదేవి భయపడుతుంది.

పద్మిణీ నమ్మకం! గౌతమ్ ఆయుధం!!

పద్మిణీ భర్త దగ్గరకు కూర్చుని కబుర్లు చెబుతుంది. ‘మీరు శ్రీరాముడు లాంటి వాళ్లండీ’ అంటూ పొగుడుతుంది. దాంతో గౌతమ్ కూడా.. ‘నీలాంటి భార్య ఉంటే.. ఎవరైనా శ్రీరాముడిలానే ఉంటారు’ అంటూ మాటలతో మాయ చేస్తాడు. దాంతో పద్మిణీ ప్రేమగా భర్త గుండెలపై వాలిపోతుంది. ‘మీరు శ్రీరాముడే అయినా.. ఆ రాణి మాత్రం లేని ఆశలు పెట్టుకుంటోందనిపిస్తోంది. తన బుద్ది వచ్చేలా చేయాలి’ అనుకుంటుంది పద్మిణీ మనసులో.. గౌతమ్ మాత్రం గుండెల నిండా పద్మిణీ ఉన్నట్లుగా ప్రేమగా నవ్వుతూ నటిస్తాడు.

కలలో బయటపడిన రహస్యం

రాజమాత శ్యామలా దేవికి కలలో పిచ్చి పిచ్చి సంఘటనలు కనిపిస్తుంటాయి. ఒక నర్తకీ నాట్యం చేయడం(కాళ్లు మాత్రమే కనిపిస్తాయి), దాన్ని ఓ రాజు ఆస్వాదించడం(అతడి చేతులు మాత్రమే కనిపిస్తాయి) ‘ఏమండీ ఆ నర్తకీ కోసం ఆస్తులు తగలేయొద్దండీ’ అంటూ శ్యామలా దేవి అరవడం, దానికి ఆ రాజు ఆవేశంగా.. ‘రాణీ గారు.. నా నర్తకీ గురించి మరో మాట తప్పుగా మాట్లాడొద్దు’ అంటూ వార్నింగ్ ఇవ్వడం.. అంతా జరిగిన సంఘటనలనే ఆమె కలలో ఊహించుకుంటూ ఉలిక్కిపడి లేస్తుంది. (దాని బట్టి అతడే శ్యామలాదేవి భర్త అని, అతడు కూడా గౌతమ్‌లానే ఓ ఆడదానికి బానిస అయిన వ్యసనపరుడు అని అర్థం అవుతుంది.)

రాజకోటలో రహస్య గది

రిపోర్టర్ వెంకట్, బాబూ ఇద్దరూ ఓ జిరాక్స్‌ని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘ఇందులో ఉన్న తలుపులు ఆ రాజుకోటలోని ఓ గది ద్వారాలు. అందులో అందుచిక్కని రహస్యాలు ఉన్నాయట’ అంటాడు వెంకట్. ‘ఈ విషయం నీకు ఎలా తెలుసు?’ అని అడుగుతాడు బిల్డప్ బాబు. ‘నాకో సీనియర్ జర్నలిస్ట్ పంపించాడు. అయితే ఆ గదిలో ఏం ఉందో మనం కనిపెట్టాలి. ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్లరూ. ముఖ్యంగా ఆ గదిలో రాజా సిద్దేంద్ర వర్మ గారు రాసిన పుస్తకం ఒకటుంది. అది దొరికితే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు’ అంటాడు వెంకట్. అయితే ఆ రహస్య గది గురించి చెబుతున్నప్పుడు బాబు చాలా భయపడతాడు. కానీ భయం లేనట్లుగా బిల్డప్ కొడతాడు.

పద్మిణీకి శ్యామలాదేవి ఆదేశం

నిద్రలేచిన రాజమాత శ్యామలాదేవి.. ఎవరూ చూడకుండా భూజులు పట్టిన ఓ పాడుబడ్డ గదిలోకి అడుగుపెడుతుంది. ఓ పెట్టెను తెరిచి.. నాట్యం చేసే గజ్జలను పైకి తీసి చూస్తూ.. ‘వీటి కారణం గానీ ఈ రాజకోటకు ఈ పరిస్థితి వచ్చింది’ అనుకుంటూ వాటిని విసిరికొడుతుంది. వెంటనే తన భర్త (రాజా సిద్దేంద్ర వర్మ) రాసిన పుస్తకంలోని పేపర్స్ చింపి.. అగ్గిపెట్టె వెలిగించి వాటిని తగలబెడుతుంది. ‘ఈ చరిత్ర బయట ప్రపంచానికి తెలియడానికి వీల్లేదు’ అనుకుంటుంది మనసులో.. తిరిగి ఆ గదిలోంచి బయటికి వచ్చిన రాజమాత.. పద్మిణీని పిలిచి.. రాజ గురువు చెప్పిన మాటలను చెప్పి.. ‘ఈసారి ముహూర్తం తప్పితే.. మరెప్పుడూ శోభనం జరగదని రాజగురువు చెప్పారు కాబట్టి.. ఎవరికీ తెలియకుండా రాజగురువు చెప్పి చోటికి వెళ్లాలి. మీరు ఇప్పుడే బయలుదేరండి’ అంటుంది.

ఏ మార్పు రాలేదు!

దానికి మహేశ్వరి సరేనంటూ.. భర్త గౌతమ్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో రాణి.. గౌతమ్ కోసం పాలు తీసుకెళ్లి ఇస్తూ.. ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే గౌతమ్ రాణీని పెద్దగా పట్టించుకోకపోవడంతో.. రాణీ వెటకారంగా.. ‘మీ భార్యతో జరగబోయే శోభనం గురించి ఆలోచించుకుంటున్నారా? మీ మార్పుని నేను గమనిస్తూనే ఉన్నాను’ అంటుంది. దాంతో గౌతమ్.. ‘ఏ మార్పు రాలేదు’ అంటుండగా పద్మిణీ ఆ గదిలోకి అడుగుపెడుతుంది. ‘ఏం మార్పండీ?’ అంటుంది. దాంతో రాణీ, గౌతమ్ ఇద్దరూ షాక్ అవుతారు. గౌతమ్ తను అన్న మాటలను కవర్ చేసుకుంటూ.. ‘కాళు నొప్పిలో ఏ మార్పు లేదంటున్నాను పద్మిణీ’ అంటూ అబద్దం చెబుతాడు.

గౌతమ్ పద్మిణీల ప్రయాణం!

అయితే రాణీ మీద అనుమానం ఉన్న పద్మిణీ కాస్త కోపంగా చూస్తూ.. కావాలనే రాణీ స్థానాన్ని గుర్తు చేస్తూ బయటికి పంపేస్తుంది. తలుపు గడియపెట్టి.. ‘రెడీ అవ్వండి తెల్లారే సరికల్లా రాజగురువు చెప్పిన చోటుకు వెళ్లాలి’ అంటుంది. మొదట గౌతమ్ ‘ఇప్పుడెందుకు?’ అని వాదించినా.. తర్వాత ఒప్పుకుంటాడు. అయితే రాణి వెళ్లినట్లే వెళ్లి.. వెనక్కి వచ్చి.. గౌతమ్, పద్మిణీల మాటలు వింటుంది. ‘ఈ సమయంలో వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్లు బయటికి వెళ్తున్న విషయం ఎవరికీ తెలయకూడదను. లేదంటే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం’ అని మనసులో అనుకుంటుంది.

కమింగ్ అప్‌లో…

గౌతమ్, పద్మిణీలు.. ఇద్దరూ రాజ గురువు దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఆయన చెప్పిన పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్యామలాదేవి దేవుడికి మొక్కులు మొక్కుతుంది. ‘దేవుడా గౌతమ్ బాబుకు ఎలాంటి ఆపదలు రాకూడదు’ అంటూ కోరుకుంటుంది. అయితే గౌతమ్‌ని చంపడానికి ఓ వ్యక్తి పెద్ద కొండ మీద నుంచి ఓ బండ రాయిని గౌతమ్ ఉన్న వైపుగా విసురుతాడు. అయితే ఆ తిన్నగా పద్మిణీ కూడా ఉండటంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఆమె కథ కొనసాగుతోంది.