గంగూభాయి ఇంకో 150 కోట్లు కలెక్ట్ చేయాలి!

ఆలియా భట్ నటించిన గంగూభాయి కతియావాడీ ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం (ఫిబ్రవరి 25న) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గంగూభాయి సినిమా సందడి తెలుగు రాష్ట్రాల్లో ఏమంత లేకపోయినా అటు ఉత్తరాదిన బోలెడంత సందడి చేస్తోంది. అంతేకాదు.. హిందీ వెర్షన్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పటికే ఈ మూవీ 40కోట్ల రేంజులో నెట్ వసూలు చేసిందని తెలిసింది.

నిజానికి తెలుగులోనూ ఈ మూవీకి వసూళ్లకు ఆస్కారం ఉన్నా ఇక్కడ పోటీగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలైంది. భీమ్లాకు ఉన్న క్రేజు ముందు ఇంకేదీ నిలవదన్నది తెలిసినదే. ఇక ఆర్.ఆర్.ఆర్ సహా రాధేశ్యామ్ – సర్కార్ వారి పాట లాంటి క్రేజీ సినిమాలేవీ ఈ సీజన్ లో విడుదల కాకపోవడం రిలీజ్ మూవీలకు కలిసొచ్చింది. ఇక గంగూభాయి తెలుగు వెర్షన్ కి సంబంధించిన అప్ డేట్ కూడా ఏదీ సరిగా లేదు.

అయితే గంగూభాయి చిత్రం తెలుగు వెర్షన్ 10కోట్ల మేర వసూలు చేసిందన్న టాక్ కూడా వినిపించింది. నైజాంలో భన్సాలీ స్టామినా వర్కవుటైందని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక మూవీ ఆద్యంతం అలియా భట్ షో ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా ఒక సాధారణ అమ్మాయి వేశ్యగా మారాక.. ఆ తర్వాత సాటి వేశ్యలకు రక్షకురాలిగా ..కామాటిపురా నాయకురాలిగా ఎదిగిన గంగూబాయి పాత్రలో అలియా తనను తాను ఆవిష్కరించుకున్న విధానం ఎంతో అద్భుతం అంటూ జనం పొగిడేస్తున్నారు.

అలాగే మూవీలో గంగూభాయి ప్రసంగ సన్నివేశం .. పాటలు .. రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అద్భుతమైన సంగీతం.. సౌండ్ డిజైన్.. సినిమాటోగ్రఫీ కుదిరాయన్న ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీకి అవార్డులు రావడం ఖాయం అన్న చర్చా సాగుతోంది.

హిందీ మార్కెట్ వివరాల ప్రకారం.. ఈ చిత్రం మొదటి వారాంతంలో దాదాపు రూ. 40 కోట్ల రేంజుకు చేరువయ్యే అవకాశం ఉంది. దాని ఫుల్ రన్ లో నికర రూ.100 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే గంగూభాయి చిత్రంపై పెట్టిన 200 కోట్ల పెట్టుబడి బూడిదలో పోసినట్టేనని నిందించిన కంగన ఆలియా నటనను మాత్రం ప్రశంసించకుండా ఆగలేకపోయింది.

కానీ తను అన్నట్టుగానే ఇప్పుడు గంగూభాయి నష్టాలు చూడాల్సి వస్తుందేమోనన్న సందేహం ఉంది. వంద కోట్ల వసూళ్లతో సరిపుచ్చితో మరో 100 కోట్లు గంగలో పోసినట్టే కదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. తొలి వారాంతంతోనే ఏ సినిమా అయినా థియేటర్ల నుంచి తొలగిపోతోంది కాబట్టి గంగూభాయి ఫుల్ రన్ సన్నివేశమేంటో కాస్త వేచి చూస్తే కానీ చెప్పలేం.దాదాపు 200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని భన్సాలీ అత్యంత భారీగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.