‘మహిళలను గౌరవిద్దాం..’ బన్నీ డైలాగ్ తో హైదరాబాద్ పోలీసుల ప్రచారం

దేశంలో మహిళల రక్షణ ఎంతో సవాల్ గా మారింది. ప్రతిరోజూ దేశంలో మహిళల భద్రతను ప్రశ్నించే అఘాయిత్యాలు ఎక్కడోచోట జరగడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవంపై సెలబ్రిటీలు, పోలీసులు నిత్యం ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలిసులు మహిళలను గౌరవించుకోవాలి అంటూ సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించే సినీ మాధ్యమాన్ని ఎంచుకున్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ సన్నివేశం ద్వారా మహిళల పట్ల గౌరవం ఎలా ఉండాలో వివరించే ప్రయత్నం చేశారు. సినిమాలోని ఓ సన్నివేశంలో హీరోయిన్ పూజా హేగ్డేను బ్రహ్మాజీ బెదిరిస్తాడు. ఆ సమయంలో బ్రహ్మాజీతో అల్లు అర్జున్.. ‘ముఖ్యంగా.. అందులోనూ ప్రధానంగా.. ఒక స్త్రీ వద్దు.. అని అంటే మాత్రం దానర్ధం.. అస్సలు వద్దని’ అని అంటాడు. 13 సెకన్ల ఈ వీడియో క్లిప్ ను హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

‘మహిళలను గౌరవిద్దాం. ఎందుకంటే.. ఒక జెంటిల్ మెన్ గా మహిళలను గౌరవించుకోవాలి’ అంటూ అకౌంట్ లో రాశారు. హైదరాబాద్ పోలీసులు వినూత్నంగా ఆలోచించడం అందరినీ ఆకట్టుకుంటోంది. రని చెప్పాలి. దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై దర్శక, రచయిత త్రివిక్రమ్ ఈ డైలాగ్ రాశారు. ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. #RespectWomen, #StopCrimesAgainstWomen అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేశారు.