మన్సాస్ ట్రస్టు: మహిళా సెంటిమెంటు.. ఇదెక్కడి ఆయింట్మెంట్.?

మన్సాస్ ట్రస్టు విషయంలో వైఎస్ జగన్ సర్కారుకి హైకోర్టులో షాక్ తగలడం, ట్రస్టు ఛైర్మన్‌గా తిరిగి టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించడం తెలిసిన విషయాలే. ట్రస్టు నిబంధనల్ని పక్కన పెట్టి, ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించి, అశోక్ గజపతిరాజుని దించేసి, ఆయన స్థానంలో సంచైతను నియమించింది. సంచైత, స్వయానా అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె.

కానీ, సంచైత తల్లి ఎప్పుడో ఆనంద గజపతిరాజు నుంచి విడాకులు తీసుకున్నారు. ఆనంద గజపతిరాజుకి మరో కుమార్తె ఊర్మిళ కూడా వున్నారు. ఇక, సంచైత బీజేపీ నేత. కానీ, బీజేపీ నుంచి కూడా మన్సాస్ ట్రస్టు వ్యవహారంలో సంచైతకు మద్దతు లభించలేదు. సంచైత విషయంలో వైఎస్ జగన్ సర్కార్ అత్యుత్సాహం చూపడానికి కారణం ఎలాగైనా అశోక్ గజపతిరాజుని దెబ్బ కొట్టాలనే దుగ్ధ మాత్రమేనన్న భావన బలంగా వెళ్ళిపోయింది ఉత్తరాంధ్ర ప్రజానీకంలో.

మన్సాస్ ట్రస్టు ఆస్తులు చాలా ప్రాంతాల్లో వున్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన భూములున్నాయి ఈ ట్రస్టుకి. అందుకే, అధికార పార్టీ కన్ను పడింది ఈ ట్రస్టు మీద.. అన్న విమర్శలున్నాయి. ఇక, పదవి పోగొట్టుకున్న సంచైత, ఏపీ మహిళా కమిషన్‌ని ఆశ్రయించారు. ట్రస్టులో మహిళలకు వ్యతిరేకంగా నిబంధనలున్నాయంటూ ఫిర్యాదు చేశారు. మహిళను అవమానించడం తగదంటూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ గుస్సా అయ్యారు. ఏం మన్సాస్ ట్రస్టు విషయంలోనే ఎందుకీ అత్యుత్సాహం.?

ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఓ మహిళకు ఇవ్వకూడదు.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ వుండగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు.? పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఎందుకు వుండాలి.? గౌరవాధ్యక్షురాలి పాత్రకు విజయమ్మను ఎందుకు పరిమితం చేశారు.? వంటి ప్రశ్నలు రావడం సహజమే. కానీ, ఈ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానముండదు. అవన్నీ సరే, సలహాదారుల విషయంలో ఎంతమంది మహిళలకు అవకాశం దక్కింది.? టీటీడీ ఛైర్మన్ విషయంలో మహిళకు ఎందుకు అవకాశమివ్వకూడదు.? ఇలాంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ వైపు అస్త్రాలుగా దూసుకెళుతున్నాయి. మరి, వీటికి ప్రభుత్వం దగ్గరగానీ, అధికార పార్టీ దగ్గరగానీ సమాధానం వుందా.