దేవాలయాల సాక్షిగా ‘రాజుగారి’ రబస.!

మొన్న సింహాచలం దేవస్థానం.. ఆ తర్వాత పైడితల్లి జాతర వ్యవహారం.. తాజాగా రామతీర్థం దేవాలయం శంకుస్థాపన వివాదం.. అన్నిటిలోనూ కామన్ పాయింట్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు.

రాజకీయాల సంగతి పక్కన పెడితే, ఉత్తరాంధ్రలో అశోక్ గజపతిరాజు పట్ల చాలామందికి చాలా గౌరవం వున్నమాట వాస్తవం. విజయనగరం రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడమొక్కటే కారణం కాదు.. చాలా కారణాలున్నాయి, ఆయనపట్ల ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ప్రత్యేకమైన గౌరవం వుండడానికి. విద్యాసంస్థల్ని నడపడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం.. ఇలా చాలా అంశాలున్నాయి.

గత కొంతకాలంగా అశోక్ గజపతిరాజుని, అధికార వైసీపీ వేధింపులకు గురిచేస్తోందన్నది నిర్వివాదాంశం. మన్సాస్ ట్రస్ట్ విషయంలో సంచైతను రంగంలోకి దించడం దగ్గర్నుంచి, ప్రతి విషయంలోనూ అధికార వైసీపీ వేలు పెడుతున్న వైనం.. ఈ క్రమంలో అధికార వైసీపీ ప్రతిసారీ చుక్కెదురవుతుండడం తెలిసిన విషయాలే.

అశోక్ గజపతిరాజు, పలు దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా వున్నారు. రామతీర్థం దేవస్థానానికీ అంతే. ఆ దేవాలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకోవడం మంచి విషయమే.. కాదనలేం. కానీ, ఈ క్రమంలో అనువంశిక ధర్మకర్తను అవమానాలకు గురిచేస్తే ఎలా.?

‘శిలాఫలకంలో పేరు పెట్టాం.. ఆలయ అధికారులు ఆయన్ను ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు..’ అని అధికార పార్టీ చెప్పుకుంటే సరిపోదు.. అశోక్ గజపతిరాజుని వైసీపీ.. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అవమానిస్తున్న తీరు కళ్ళముందు కనిపిస్తూనే వుంది. సహజంగానే, ఇంతటి అవమానభారాన్ని తట్టుకోవడం రాజుగారికి కష్టమైన వ్యవహారమే మరి. ఈ క్రమంలోనే ఆయన సంయమనం కోల్పోతున్నారేమో.

తాజాగా, నిన్న రామతీర్థంలో జరిగిన గొడవ, తదనంతర పరిణామాలు.. అశోక్ గజపతిరాజుపై మరింత సింపతీ పెరగడానికి కారణమయ్యాయి. ఆయన మీద కేసు నమోదైంది.. దాంతో, అధికార పార్టీ పట్ల ఈసడింపులు మరింతగా పెరిగిపోతున్నాయి ఉత్తరాంధ్రలో.