అమెరికా బాక్స్ ని షేక్ చేస్తోన్న నాయక్!

పవర్ స్టార్ పవర్ పంచ్ కి బాక్సాఫీస్ కి షేకైపోతుంది. భారీ వసూళ్ల దిశగా `భీమ్లా నాయక్` దూసుకుపోతుంది. మొదటి షోతోనే ఫ్యాన్స్ కి నాయక్ ఫీవర్ పుట్టించాడు. అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో నాయక్ వేగాన్ని ఆపడం కష్టమని తేలిపోయింది. సినిమాకి రివ్యూలన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి.

ఈ అంశం చాలా కీలకంగా మారింది. పవన్ గత సినిమాల విషయంలో ఇంత పాజిటివిటీ కనిపించలేదు. కానీ నాయక్ విషయంలో మాత్రం అన్ని పాజిటివ్ గా రావడం పవన్ కి కలిసొచ్చింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో భీమ్లా నాయక్ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.

ఇక అమెరికా బాక్సాఫీస్ ని నాయక్ -డేనియల్ షేక్ చేస్తున్నారు. అక్కడ ప్రీమియర్ షోలతోనే మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. తొలి రోజే నుంచి శనివారం వరకూ ఈ యాక్షన్ థ్రిల్లర్ 1.8 మిలియన్ డార్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. అధికారిక నివేదికల ప్రకారం మొదటి రోజే మిలియన్ డాలర్లు వసూలు చేసిందని సమాచారం.

ఈ రోజు కూడా వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్ల పరంగా 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పవన్ అమెరికా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడని స్ఫష్టంగా అర్ధమవుతుంది.

ఇదే వేగాన్ని వారం రోజుల పాటు కొనసాగిస్తే అమెరికా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని..క్లోజింగ్ కడా పెద్ద మొత్తంలో ఉంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి పోటీగా సినిమాలు కూడా లేవు. `వలిమై` రిలీజ్ అయినా భీమ్లా వేగాన్ని తట్టుకోవడం కష్టమనే టాక్ ఉండనే ఉంది. పైగా అమెరికాలో తెలుగు ప్రేక్షకులు భారీగా ఉన్నారు.

థియేటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇంకా థియేటర్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఇవన్నీ నాయక్ అనుకూలంగానే ఉంటాయని తెలుస్తోంది. సరిగ్గా వారం రోజులు `భీమ్లా నాయక్` థియేటర్లో ఆడితే భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తుందని చెప్పొచ్చు.

పవన్ గత సినిమాల వసూళ్లను `భీమ్లా నాయక్` సునాయాసంగా దాటేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి పవన్ కి ఓవర్సీస్ లో అంత డిమాండ్ లేదని ఓ విమర్శ ఉంది. ఇప్పుడు వాటన్నింటిని నాయక్ సరిచేస్తాడు? అన్న అంచనాలు తెరపైకి వస్తున్నాయి.

పవన్ సినిమాలు టార్గెట్ గా ఏపీ ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో విదేశాల్లో పవన్ దూకుడు చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కూడా తగ్గిన టిక్కెట్ ధరలతోనే భారీ వసూళ్లు సాధిస్తుందని తెలుస్తోంది.

`అఖండ`..`పుష్ప` చిత్రాలు అలాగే రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. రీజనల్ గా వాటి సరసన `భీమ్లా నాయక్` చేరుతాడని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో పవన్ కి జోడీగా నిత్యామీనన్ నటించగా.. రానికి జంటగా సంయుక్త మీనన్ నటించింది. ఈ చిత్రానికి సాగర్. కె. చంద్ర దర్శకత్వం వహించారు.