మా విబేధాలపై రంగంలోకి దిగిన చిరంజీవి..! ఎన్నికలు త్వరగా నిర్వహించండి

టాలీవుడ్ ప్రతి రెండేళ్లకు జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది కోవిడ్ కారణాలతో ఆలస్యమయ్యాయి. ఎన్నికల తేదీ ప్రకటించకుండానే అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్ధుల మధ్య ఆరోపణలు.. తారాస్థాయికి వెళ్లిపోయాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. మా ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కోరుతూ సీనియర్ నటులు, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు బహిరంగ లేఖ రాశారు.

‘సభ్యుల బహిరంగ ప్రకటనలతో మా ప్రతిష్ట దెబ్బతింటోంది. కోవిడ్ నిబంధనలతో త్వరితగతిన ఎన్నికలు నిర్వహించి పరిశ్రమ, మా ప్రతిష్ట పెంచాలి. మా ప్రతిష్టను దెబ్బ తీసేలా సభ్యుల వ్యాఖ్యలు ఉంటున్నాయి. అభిప్రాయబేధాలు, సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ.. ఒకరినొకరు బహిరంగ విమర్శలు చేసుకోవడం సరైనది కాదు. అటువంటి వారిని ఉపేక్షించొద్దు. ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ కార్యవర్గమే. త్వరగా ఎన్నికలు నిర్వహించి నిర్ణయాలు తీసుకునే కమిటీని త్వరగా నియమించండి. సమస్యను మీరు త్వరగా పరిష్కరిస్తారనే భావిస్తున్నాను’ అని చిరంజీవి తన లేఖలో ప్రస్తావించారు.