జస్ట్ మిస్: అన్నీ సెట్ అయ్యాక చిరు, వెంకీ, నాగ్‌ల మల్టీస్టారర్‌ కాన్సల్ ఎందుకయ్యిందంటే?

టాలీవుడ్‌ ప్రేక్షకులు మల్టీస్టారర్‌ చిత్రాల కోసం మొహం వాచి ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత భారీ మల్టీస్టారర్‌ చిత్రంకు రంగం సిద్దం అయ్యింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ కరోనా లేకుంటే బ్యాలన్స్‌ షూట్‌ ఇప్పటి వరకు పూర్తి అయ్యి ఉండేది. ఈ మల్టీస్టారర్‌ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతకు మించిన మల్టీస్టారర్‌ ఒకటి 2002లో రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ భారీ మల్టీస్టారర్‌ క్యాన్సిల్‌ అయ్యింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన 100వ సినిమాగా చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జునలతో భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్‌ చేశాడు. త్రివేణి సంగమం అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు కథ రెడీ అయ్యింది. చిన్ని కృష్ణ సిద్దం చేసిన కథకు ముగ్గురు హీరోలు ఓకే చెప్పారు. రామానాయుడు, అశ్వినీదత్‌, అల్లు అరవింద్‌లు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. మునుపెన్నడు లేనంత భారీ బడ్జెట్‌తో రాఘవేంద్ర రావు ఈ సినిమాను తీసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

షూటింగ్‌కు మరో వారం పదిరోజుల్లో వెళ్లబోతున్నారు అనగా క్లైమాక్స్‌ విషయంలో విభేదాలు వచ్చాయి. సరైన క్లైమాక్స్‌ కుదరలేదు. నిర్మాతలు మరియు దర్శకుడితో పాటు హీరోలకు క్లైమాక్స్‌ విషయంలో నమ్మకం కలుగక పోవడంతో మొత్తం సినిమానే క్యాన్సిల్‌ చేశారు. ఆ సినిమా కనుక తెరకెక్కి ఉంటే తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద మల్టీస్టారర్‌గా అప్పుడు ఇప్పుడు ఎప్పటికి నిలిచి పోయి ఉండేది. ఈ సినిమా క్యాన్సిల్‌ అవ్వడంతో రాఘవేంద్ర రావు తన 100వ సినిమాగా అల్లు అర్జున్‌తో గంగోత్రిని తెరకెక్కించిన విషయం తెల్సిందే.