దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు: మరో లక్షకి 20 రోజులేనా.?

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గత నాలుగైదు రోజులుగా సగటుని 5 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తన్నారు. ఒకవేళ ఇదే తరహాలో.. అంటే సగటున రోజుకి 5 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే, కేవలం ఇరవై రోజుల్లోనే 2 లక్షల మైలు రాయిని దాటేయొచ్చు. అయితే, ఇది మరింత వేగంగా కూడా జరగొచ్చన్నది నిపుణుల అంచనా.

మద్యం దుకాణాలకు కేంద్రం అనుమతిచ్చినప్పటినుంచీ దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. లాక్‌డౌన్‌ నుంచి ఎప్పటికప్పుడు మరిన్ని వెసులుబాట్లు లభిస్తుండడం కూడా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడానికి కారణమని చెప్పొచ్చు. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎక్కువ సడలింపులు అమల్లోకి వచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రజా రవాణా కూడా అందుబాటులోకి వస్తోంది. బస్సులు తిరుగుతున్నాయి. సినిమా ది¸యేటర్లు, విద్యా సంస్థలు, దేవాలయాలు, షాపింగ్‌ మాల్స్‌ తప్ప.. దాదాపుగా మిగతా అన్నిటికీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి ప్రభుత్వాలు. రానున్న వారం పది రోజుల్లో ఈ వెసులుబాట్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయన్నది నిర్వివాదాంశం.

జూన్‌ – జులై – ఆగస్ట్‌ నెలలు చాలా కీలకం అనీ, కరోనా కేసుల సంఖ్య ఈ మూడు నెలల్లో అత్యంత భారీగా వుండబోతోందనీ, ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం వుందనీ పలు నివేదికలు చెబుతున్న విషయం విదితమే. ఇప్పటికే నమోదైన లక్ష కేసులకే దేశం విలవిల్లాడుతున్న దరిమిలా, రానున్న రోజుల్లో పరిరిస్థితి ఇంకెలా వుంటుందో ఏమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భారత్‌ లాంటి జనసాంద్రత ఎక్కువ వున్న దేశాల్లో కరోనా వైరస్‌ విశ్వరూపం చూపించడం ఖాయమని, రానున్నది వర్షాకాలం కావడంతో కరోనా వైరస్‌కి అది మరింత సానుకూల వాతావరణం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా వుంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే కరోనా ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. దేశానికి సంబంధించి మహారాష్ట్ర కరోనా కేంద్ర బిందువుగా మారిపోయింది. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.