ఈటెల రాజీనామాపై కేసీఆర్ కౌంటర్ ఎటాక్ ఎలా.?

రాజకీయాల్లో ఎత్తులకు పై యెత్తులు సహజమే. మంత్రి పదవి నుంచి తొలగింపబడ్డాక ఈటెల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గం హుజూరాబాద్ ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకుంటానన్నారు. సొంత పార్టీ పెట్టడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం, బీజేపీలో వైపు నడవడం.. ఇలా పలు రకాల ఆప్షన్స్ ఆయనకు అప్పట్లో వున్నాయి. సుదీర్ఘంగా చర్చలు జరిపారు సన్నిహితులతో ఈటెల రాజేందర్ గత కొద్దిరోజులుగా. ఈటెల అవినీతిపరుడన్న ముద్ర వేసేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పిల్లిమొగ్గలేసింది.

అయితే, ఈటెల రాజేందర్ విషయంలో తెలంగాణ సమాజం నుంచి టీఆర్ఎస్ ఊహించని స్పందన వచ్చిందన్నది నిర్వివాదాంశం. ఈటెలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బలిపశువుని చేసేశారన్న అభిప్రాయమే తెలంగాణ సమాజంలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, తిమ్మిని బమ్మిని చేయడంలో దిట్ట అయిన కేసీఆర్, ఈటెల విషయంలో తన పంతం నెగ్గించుకునేందుకు ఇతరత్రా చాలా అస్త్రాలు ప్రయోగించారు. కానీ, అవేవీ అంతగా పనిచేయలేదు.

ఈటెల భూ కబ్జాకోరు అయితే, అలాంటోళ్ళు ఇంకా మంత్రివర్గంలో చాలామందే వున్నారు కదా.. వాళ్ళమీద ఎందుకు చర్యల్లేవు.? అన్న ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర సమితి దగ్గర సమాధానమే లేని పరిస్థితి. ఇక, ఈటెల రేపు రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈటెల రాజీనామా చేస్తే, తెలంగాణ రాష్ట్ర సమితిలో వున్న ‘ఫిరాయింపు ఎమ్మల్యేలపై’ ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. కానీ, వాళ్ళెవరూ రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు రాజీనామా చేస్తామన్నా, వాళ్ళతో రాజీనామా చేయించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు.

ఈటెల రాజీనామాకి ఆమోదం పొందడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ కథ ఎలా వుండబోతోంది.? ఆ కథలో ఎన్నెన్ని రాజకీయ మలుపులు కనిపిస్తాయి.? అన్నది వేచి చూడాల్సిందే.