ఈటెల గెలుపు.. కేసీయార్ ఓటమి.. ఈక్వేషన్‌లో నిజమెంత.?

సిట్టింగ్ స్థానాన్ని ఈటెల రాజేందర్ నిలబెట్టుకున్నారు.. సిట్టింగ్ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి కోల్పోయింది. భారతీయ జనతా పార్టీకి ఓ స్థానం అసెంబ్లీలో పెరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఓ స్థానం కోల్పోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించిన ఈక్వేషన్ ఇది.

నో డౌట్.. ఇది బీజేపీ గెలుపు.. ఇది టీఆర్ఎస్ ఓటమి. అంతేనా, అంతకు మించి.. ఇది ఈటెల రాజేందర్ గెలుపు.. టీఆర్ఎస్ అధినేత కేసీయార్ ఓటమి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇదే నిజం. ‘హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అంత ప్రాధాన్యతాంశం కాదు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ వ్యాఖ్యానించారట. అదే నిజమైతే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఇది తెలంగాణ రాష్ట్ర సమితి కోరి తెచ్చుకున్న ఉప ఎన్నిక. మంత్రిగా వున్న ఈటెల రాజేందర్ మీద వేటు వేశారు ముఖ్యమంత్రి కేసీయార్. అవినీతి ఆరోపణలు చేసి, మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్‌ని తొలగించారు కేసీయార్. అవమానాలు భరించలేక, ఎమ్మెల్యే పదవికి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకీ ఈటెల రాజేందర్ రాజీనామా చేశారు.

అలా హుజూరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లయ్యింది. ఇక, ఎలాగైనా అక్కడ గెలవాలన్న తపనతో, కేసీయార్ అత్యంత వ్యూహాత్మకంగా దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చారు. కానీ, ఆ పథకం లబ్దిదారులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని లైట్ తీసుకున్నారు.

అసలు, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెంటి వేయబడ్డాకనే ఈటెల రాజేందర్, కేసీయార్ కంటే పెద్ద నాయకుడనిపించుకున్నారు. అబ్బే, అంత సీన్ లేదు.. అని చాలామంది అనొచ్చుగాక. కానీ, ఈటెల రాజేందర్ ఉద్యమ నాయకుడు. ఆ పవర్ ఏంటో ఈ రోజు వచ్చిన ఉప ఎన్నిక ఫలితంతో తేలిపోయింది.

వాట్ నెక్స్‌ట్.? ఇప్పుడు టీఆర్ఎస్ చేయగలిగిందేమీ లేదు. బీజేపీలో ఈటెల రాజేందర్ స్థాయి మరింత పెరగబోతోంది. అది కేసీయార్ సహా గులాబీ నేతలెవరికీ మింగుడుపడని అంశమే. టీఆర్ఎస్‌లో అవమానాలు ఎదుర్కొంటున్న నేతలెవరైనాసరే, ధైర్యంగా బయటకు వచ్చేసి.. గులాబీ పార్టీని సవాల్ చేయొచ్చని ఈటెల వ్యవహారంతో నిరూపితమైపోయిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది.