కేసీఆర్ నాకు మార్కులు వేయ‌డం ఏంటంటున్న జానా

తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ప‌నితీరు-ప్ర‌జాద‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేయించిన ఇంటెలిజెన్స్ స‌ర్వే రిపోర్ట్ ఇటు టీఆర్ఎస్‌తో పాటు అటు ప్ర‌తిప‌క్షాల కాంగ్రెస్‌లోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ స‌ర్వే రిపోర్టులో మంచి ర్యాంకులు సంపాదించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతోష‌ప‌డుతుండ‌గా ర్యాంక్ త‌గ్గిన వారు వాపోతున్నారు. అయితే సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్‌, సీఎల్పీ ఉప‌నేత జానారెడ్డి మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో ముచ్చ‌టించారు.

త‌న రాజకీయ జీవితంలో సర్వేలు చేయించుకోలేదని, సర్వేల గురించి ఆలోచించలేదని జానారెడ్డి స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ వేసిన మార్కులతో త‌న‌కు సంబంధం లేదని, ప్రజలు ఇచ్చే నిర్ణయమే ఫైనల్ అని జానా రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఖర్చుతో సర్వేలు చేయవచ్చా అనే సందేహాన్ని ఈ సంద‌ర్భంగా వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న దుబారాల్లో ఇదొక భాగమ‌ని జానారెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీయే 2019లో కూడా విజ‌యం సాధిస్తుంద‌నే విష‌యంపై జానారెడ్డి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. రెండు ఎంపీ సీట్లను మాత్ర‌మే గెలిచిన‌పుడు బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎవ‌రైనా ఉహించారా? అని విలేక‌రుల‌ను ఎదురు ప్ర‌శ్నించిన జానారెడ్డి తెలంగాణ‌లోనూ ఇదే జ‌ర‌గ‌బోతున్న‌ద‌ని చెప్పారు.రాష్ట్రంలో త‌మ పార్టీ పుంజుకుంటుంద‌నే ధీమాను వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ లోని సీఎం ప‌ద‌వి పోటీపై సైతం జానారెడ్డి స్పందించారు. నేనే సీఎం అని ప‌ది మందితో అన్నంత మాత్రానా ఎవ‌రైనా సీఎం అయిపోతారా?  అంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల మ‌న్న‌న పొంది పార్టీ అధికారంలోకి వ‌స్తే ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతార‌నేది కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యిస్తుంద‌ని తెలిపారు.