‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ కన్నడలో కంటే తెలుగులోనే ఎక్కువ..!

తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించడానికి ఎప్పుడూ ముందే ఉంటారనే సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా హీరో ఎవరనేది పట్టించుకోకుండా.. మంచి కంటెంట్ తో రూపొందే చిత్రాలను ఎంకరేజ్ చేస్తుంటారు.

చిన్నదా పెద్దదా అనే భేదం చూపకుండా ప్రతీ మంచి సినిమాను అభినందిస్తుంటారు. కంటెంట్ నచ్చితే డబ్బింగ్ మూవీ అయినా నెత్తిన పెట్టుకుంటారు.. బాగోలేకపోతే మన సినిమా అయినా సరే నిర్ధాక్ష్యంగా ప్లాప్ చేస్తుంటారు.

ఇప్పుడు తమిళ – కన్నడ – మలయాళ ఫిలిం మేకర్స్ సైతం తమ సినిమాలను టాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండటం.. ఇతర భాషల హీరోలు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లో నటించాడని ఉత్సాహం కనబరచడానికి కారణం ఇక్కడ మన ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకమే.

ఇటీవల కాలంలో అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులోనూ మంచి వసూళ్ళు రాబట్టాయి. ఇప్పుడు లేటెస్టుగా బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చిన ”కేజీయఫ్: చాప్టర్ 2” మూవీ తొలి రోజు కన్నడ వెర్సన్ కంటే తెలుగు వెర్షన్ ఎక్కువ కలెక్షన్స్ అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కన్నడ హీరో యష్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 1’ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సంచనలం సృష్టించింది. తెలుగులో 12 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. రెండో భాగంపై ఏర్పడిన హైప్ దృష్ట్యా చాప్టర్-2 ను తెలుగులో 100 కోట్లకు పైగా చెల్లించి సినిమాను తీసుకున్నారు.

ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజైన ‘కేజీయఫ్ 2’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే 159.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని 19.7 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. అదే సమయంలో కన్నడ వెర్సన్ 17 కోట్లు వసూలు చేసింది. అంటే అక్కడి కంటే 2.7 కోట్లు ఇక్కడ అధికంగా వచ్చాయి.

‘కేజీఎఫ్ 2’ సినిమాకు ఏపీ తెలంగాణలలో లభిస్తోన్న ఆదరణకు కన్నడిగులు తెలుగు ప్రేక్షకులను గౌరవించాలి. అలాంటిదేమీ చేయకుండా సోషల్ మీడియాలో అతి చేస్తున్నారు. తెలుగు సినిమాల కంటే గొప్ప అన్నట్లుగా సెటైర్లు వేస్తున్నారు.

భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ‘బాహుబలి 2’ మరియు ‘RRR’ – ‘పుష్ప’ వంటి తెలుగు సినిమాలతో పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు. మరి లాంగ్ రన్ లో ‘కేజీఎఫ్ 2’ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.