మంత్రి కొడాలి నాని తదుపరి రాజకీయ వ్యూహమేంటి.?

మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పంచాయితీ ఎన్నికల వేళ కొడాలి నాని తన నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్న విషయం విదితమే. అది, ఆయనకు బాగా అలవాటైపోయిన వ్యవహారం. గతంలోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి.. మంత్రులు కాస్తంత నోటిని అదుపులో పెట్టుకోవాలన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు.

వాటిని బేఖాతరు చేసిన మంత్రులకు తనదైన స్టయిల్లో షాకిచ్చారు నిమ్మగడ్డ. అయితే, కోర్టును ఆశ్రయించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊరట పొందిన సంగతి తెలిసిందే. తాజాగా, మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నుంచి షాక్ తగిలింది. షోకాజ్ నోటీసుని ఎస్ఈసీ జారీ చేస్తే, దానికి మంత్రి కొడాలి నాని వివరణ ఇస్తూ, ‘ఎస్ఈసీ అంటే తనకు అపారమైన గౌరవం వుంది’ అంటూ సెలవిచ్చారు. అయినా, ఎస్ఈసీ ఆ వివరణతో సంతృప్తి చెందలేదు. మంత్రి కొడాలి నానిపై చర్యలకు సిద్ధమయ్యింది. కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఎస్ఈసీ. మరిప్పుడు కొడాలి నాని వ్యూహమేంటి.? మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సభా హక్కుల ఉల్లంఘన అనే అస్త్రాన్ని ప్రయోగించినట్లుగా మంత్రి కొడాలి నాని కూడా అదే పని చేస్తారా? అంటే, ఔననే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని జైలుకు పంపించే సత్తా అసెంబ్లీకి వుంది.. అంటూ ప్రివిలేజ్ కమిటీ తరఫున హెచ్చరికల్లాంటి ప్రచారాలు బయటకు వచ్చిన విషయం విదితమే. గతంలో జరిగిన ఇలాంటి కొన్ని ఘటనల్ని ఉదహరిస్తూ, నిమ్మగడ్డను తమ దారికి తెచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నించిందనుకోండి.. అది వేరే సంగతి. ఇక, కొడాలి నాని విషయానికొస్తే, ఆయన ఎస్ఈసీకి క్షమాపణ చెబుతారా.? కోర్టు నుంచి ఊరట పొందుతారా.? స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తారా.? అన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు.