వేరే ఆప్షన్లను చూసుకుంటున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సినిమాల ఎంపికలో చాలా కచ్చితంగా ఉంటున్నాడు. తనకు ఏదైనా నచ్చితేనే సినిమాను లైన్లో పెడుతున్నాడు. దర్శకుడితో తనకున్న అనుబంధం కారణంగా మొహమాటానికి వెళ్లట్లేదు. ఒకవేళ నచ్చకపోతే తనకు హిట్ ఇచ్చిన దర్శకుడైనా సరే పక్కన పెట్టేస్తున్నాడు. నచ్చితే ఆ దర్శకుడు రేంజ్ కూడా చూడకుండా అవకాశం ఇస్తున్నాడు.

అప్పటిదాకా టాప్ లీగ్ లో ఒక్క సినిమా కూడా చేయని అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు తీసి సూపర్ హిట్ కొట్టాడు మహేష్ బాబు. ఇప్పుడు వంశీ పైడిపల్లితో సినిమా అందరూ కన్ఫర్మ్ అనుకుంటూ ఉండగా దాన్ని పక్కనపెట్టేశాడు.

పరశురామ్ ను పిలిచి తనకు గతంలో నరేట్ చేసిన కథకు మెరుగులు దిద్దుకుని రమ్మని చెప్పాడు. మహేష్ నుండి పిలుపు రావడంతో నాగ చైతన్య సినిమాను పక్కనపెట్టి పరశురామ్ మహేష్ కథపై కసరత్తులు మొదలుపెట్టేశాడు. ఇక సినిమా లాంచ్ అవ్వడమే తరువాయి అనుకుంటూ ఉండగా కరోనా కారణంగా లాక్ డౌన్ ను ప్రకటించారు. దీంతో ఏ విధమైన సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టలేని పరిస్థితి.

ఈ గ్యాప్ ను మహేష్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. పరశురామ్ బెస్ట్ స్క్రిప్ట్ తో వస్తే ఓకే. లేదంటే బ్యాకప్ ఉండాలన్నది మహేష్ భావన. అందుకే వేరే దర్శకులకు కూడా తాను అందుబాటులో ఉన్నానన్న ఫీలర్స్ పంపిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరోసారి ఇందుకోసమే టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ తో కమిట్మెంట్ ఉంది కనుక వచ్చే ఏడాది చివరికి కానీ ఫ్రీ అవ్వలేడు. లాక్ డౌన్ ముగిసేలోగా ఏదైనా మంచి కథ తన వద్దకు వస్తుందన్న ఆలోచనలో ఉన్నాడు సూపర్ స్టార్.